
సీఎఫ్ ఎఫ్‌డీపీటీ పర్యటన
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన రేంజ్ పరిధిలో ఆదివారం సీఎఫ్ ఫీల్డ్ డైరెక్టర్ కవ్వాల్ టైగర్ రిజర్వ్(ఎఫ్‌డీపీటీ) శాంతారాం పర్యటించారు. జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ టిబ్రేవాల్‌తో కలిసి తక్కళ్లపల్లి బీట్‌ను సందర్శించారు. అటవీశాఖ తిరిగి స్వాధీనం చేసుకున్న పోడు భూముల్లో చేపట్టనున్న పనులపై ఆరా తీశారు. కొత్తగా పోడు వ్యవసాయం జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేటగాళ్లు అటవీ జంతువులను వేటాడకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో దేవిదాస్, రెబ్బెన రేంజ్ అధికారి భానేష్, బీట్ అధికారులు అయాజ్, స్వాతి పాల్గొన్నారు.
ఖర్జెల్లి రేంజ్‌లో..
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని ఖర్జెల్లి రేంజ్‌లో ఆదివారం సీఎఫ్, ఎఫ్‌డీపీటీ శాంతారాం పర్యటించారు. రేంజ్ పరిధిలోని దిందా, బందెపల్లి అటవీ బీట్లను డీఎఫ్‌వో నీరజ్ టిబ్రేవాల్, ఎఫ్‌డీవో సుశాంత్ బొగాడేలతో కలిసి పరిశీలించారు. అటవీ భూముల్లో ఆక్రమణలు, కందకాలు, అటవీ అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. స్థానిక అటవీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌటాల సీఐ సంతోష్ కుమార్, ఎఫ్‌ఆర్‌వో ఎ.సుభాష్, ఎస్సై ఇస్లావత్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.