
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
లింగాపూర్(ఆసిఫాబాద్): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. మందుల గది, వార్డులు, ఆస్పత్రి పరిసరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల గురించి వివరించాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా నెలలు నిండిన గర్భిణులను ప్రసవం కోసం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మలేరియా, డెంగీ వంటి వ్యాధులు రాకుండా ఫాగింగ్, పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. కస్తూరిబా విద్యాలయంలో మొక్కలు నాటారు. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, ఎంపీడీవో రాంచందర్, ఎంఈవో శ్రీనివాస్, ఎంపీవో రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.