
మత్స్యకారులకు శాపం
విడుదలలో జాప్యం..
ఆసిఫాబాద్‌అర్బన్: భారీ వర్షాలకు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. గతేడాది నీటి వనరుల్లోకి చేపపిల్లల విడుదలలో జాప్యం జరగడంతో అనుకున్న సైజుకు ఎదగలే దు. ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు ప్రకటించి నా ఇప్పటివరకు టెండర్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలో 280 జలవనరులు
జిల్లాలో 72 మత్స్యకార సంఘాలు ఉండగా 2,900 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. జిల్లాలో సుమారు 1.35 కోట్ల చేపపిల్లలు విడుదల చేసేందు కు అనువైన 280 జలవనరులను గుర్తించారు. సా ధారణంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు నాటి కి జలవనరుల్లో చేపపిల్లలను వదిలితే వేసవి రాకముందే అవి అనుకున్న సైజుకు ఎదుగుతాయి. ఫలి తంగా మత్స్యకారులు చెరువులు ఎండిపోక ముందే చేపలు పట్టి విక్రయించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ గతేడాది సెప్టెంబర్ 16 తేదీ నుంచి విడుదల ప్రక్రియ ప్రారంభించారు. 35 నుంచి 40 మిల్లీమీటర్లు, 80 నుంచి 100 ఎం.ఎం. సైజు కలిగిన 72.93 లక్షల వరకు విడుదల చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. టెండర్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా కేవలం 74 జలవనరుల్లో 47.39 లక్షలు మాత్రమే విడుదల చేయగలిగారు. ఎండల తీవ్రతకు చాలా చెరువులు అడుగంటిపోయాయి. వేడికి చేపలు డిమాండ్‌కు తగిన సైజ్‌కు చేరుకోలేదు. దీంతో చాలా మండలాల్లో మత్స్యకారులు నష్టపోయారు. వేలం పాట ద్వారా రూ.7.51 లక్షల ఆదాయం వచ్చినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. సంఘాలు లేని 130 చెరువులకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహిస్తారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తం సంబంధిత పంచాయతీలు, కొంత మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తారు.
ఇంకా చెరువులకు చేరని చేపపిల్లలు టెండర్ ప్రక్రియ ప్రారంభించని ప్రభుత్వం ఆలస్యమైతే సైజు పెరగదని మత్స్యకారుల ఆందోళన
జోరుగా వర్షాలు..
కనిపించని హడావుడి
జిల్లాలో ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కుమురంభీం ప్రాజెక్టుతోపాటు బొక్కివాగు, పీపీరావు, అర్కగూడ తదితర ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తుండగా చెరువులు మత్తడి దూకుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు చెబు తున్నారు. వేసవిలో టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తే క్షేత్రస్థాయిలో అవసరాలకు అనుగుణంగా లక్ష్యం నిర్దేశించుకునే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించి బిల్లులు కూడా మంజూరు కాలేదని తెలుస్తోంది. చేపపిల్లల విడుదలలో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మత్స్యకార సంఘాల సభ్యులు కోరుతున్నారు.