
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి శ్రీధర్, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికా రులు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ప డకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య పనులు, డ్రెయినేజీల శుభ్రత, రహదారులపై నిల్వ నీటి తొలగింపు, దోమల వృద్ధిని నియంత్రించేందుకు ఆయిల్‌బాల్స్, బయోటెక్ పిచికారీ చేయాలని ఆదేశించారు. తాగునీటి వనరుల్లో బ్లీచింగ్ పౌడర్ వేయాలని, డెంగీ, మలేరియా ఇతర విషజ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీటిని అందించాలని సూచించారు. తెగిపోయిన రహదారులు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. జనజీవనానికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రానున్న రెండు నెలలు అప్రమత్తంగా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారి, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో చింతలమానెపల్లి మండలంలో రహదారి తెగిపోగా రూ.20 లక్షలతో మరమ్మతు చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సిద్దిఖి తదితరులు పాల్గొన్నారు.