బస్టాండ్లలో భద్రతేది..? | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్లలో భద్రతేది..?

Jul 12 2025 9:43 AM | Updated on Jul 12 2025 9:43 AM

బస్టా

బస్టాండ్లలో భద్రతేది..?

కాగజ్‌నగర్‌ నుంచి చింతలమానెపల్లికి ఆర్టీసీ బస్సులో మే 19న చింతలమానెపల్లికి చెందిన రమ్య ప్రయాణిస్తుండగా బ్యాగులోని మూడున్నర తులాల బంగారం చోరీకి గురైంది. సిర్పూర్‌(టి)– లోనవెల్లి మధ్య హ్యాండ్‌ బ్యాగ్‌ జిప్‌ తీసి గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దొంగలించారు. ఆర్టీసీ సిబ్బంది కౌటాల పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆర్టీసీ బస్సు నిలిపి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆర్టీసీ బస్సు సురక్షితమని ఎక్కితే.. బంగారం ఎత్తుకెళ్లారని బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది.

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఈ నెల 7 పాఠశాల విద్యార్థినులను ఇద్దరు యువకులు ఏడిపిస్తూ వేధింపులకు గురిచేశారు. వారిని ఆసిఫాబాద్‌ షీటీం సభ్యులు స్వప్న, రజని, దినేశ్‌ చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి యువకులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాల్లో పోకిరీల చేష్టలు ఎక్కువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు.

కౌటాల(సిర్పూర్‌): మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ తీవ్రంగా పెరిగింది. సీటు కో సం పోటీ పడుతున్నారు. ఇక పల్లె వెలుగు బస్సుల్లో అయితే కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. అయితే బస్సులు, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు చోరీ లకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. రద్దీ సమయంలో బస్సుల్లో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు దొంగలు తమ పనిని సులువుగా కానిస్తున్నారు. అమాయకుల బ్యాగులు, మెడలోని ఆభరణాలు, జేబుల్లోని పర్సులు, సెల్‌ఫోన్లను క్షణాల్లో మాయం చేస్తున్నారు. బాధితులు తేరుకునేలోపే నష్టం జరుగుతోంది. ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్నచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా సంస్థ అలసత్వం ప్రదర్శిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

రద్దీ సమయాల్లో..

జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌ పట్టణం, కౌటా ల, వాంకిడి, పెంచికల్‌పేట్‌ మండల కేంద్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. పండుగలు, శుభకార్యాల సమయంలో బస్టాండ్‌ ప్రాంతాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శి స్తున్నారు. బస్సు ఎక్కి, దిగే సమయంలో సొమ్ము, నగలు కాజేస్తున్నారు. ఆయా సరిహద్దు మండలాల్లోని ప్రజలకు మహారాష్ట్ర ప్రజలతో సత్సంబంధాలు ఉండడంతో రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు. బస్టాండ్లు, బస్సుల్లో చోరీలకు పాల్పడేవారు సరిహద్దు దాటి పారిపోతున్నారు. నిందితులను పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. కొత్తగా వచ్చే వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. నిఘా నేత్రాలు పటిష్టంగా లేకపోవడం వైఫల్యంగా మారుతోంది. ప్రయాణికుల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి.

జిల్లా వివరాలు

ప్రయాణ ప్రాంగణాల్లో నిఘా కరువు చేతివాటం చూపుతున్న దొంగలు ఆందోళన చెందుతున్న ప్రయాణికులు

నిఘా కరువు..

జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో ఐదు ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. గతంలో పోలిస్తే బస్సులు, ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు ఐదారు వేల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కీలకమైన ఈ బస్టాండ్‌లో రెండు సీసీ కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. అవి కూడా కొంతవరకు మాత్రమే కవర్‌ చేస్తున్నాయి. చోరీలు జరిగినప్పుడు దొంగలు గుర్తించడం కష్టంగా మారుతుంది. అలాగే సిర్పూర్‌ నియోజకవర్గ ప్రజలకు కాగజ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ కీలకమైంది. ఇక్కడ గ్రామీణ మండలాలతోపాటు మంచిర్యాల, హైదరాబాద్‌, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అవి సక్రమంగా పనిచేయడం లేదు.

భద్రత మా బాధ్యత

ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం కల్పించడంతోపాటు ప్రయాణికులకు భద్రత కల్పించడం మా బాధ్యత. ఆసిఫాబాద్‌లోని బస్టాండ్‌లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌ బస్టాండ్‌లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రద్దీకి అనుగుణంగా పోలీసుల సహకారంతో భద్రత కల్పిస్తాం. ప్రయాణికుల భద్రత కోసం ఆర్టీసీ సిబ్బందిని నియమించాం. ఇబ్బందులకు గురితే సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించాలి.

– రాజశేఖర్‌, ఆసిఫాబాద్‌ డిపో మేనేజర్‌

బస్టాండ్లలో భద్రతేది..?1
1/1

బస్టాండ్లలో భద్రతేది..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement