తీరని ‘దిందా’ కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

తీరని ‘దిందా’ కష్టాలు!

Jul 12 2025 9:43 AM | Updated on Jul 12 2025 9:43 AM

తీరని

తీరని ‘దిందా’ కష్టాలు!

● ఏటా వర్షాలకు జలదిగ్బంధంలో గ్రామం ● అత్యవసరమైతే ప్రాణాలు పోవాల్సిందేనా..? ● గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వని ప్రభుత్వ యంత్రాంగం ● వాగు దాటుతూ మరో యువకుడు మృత్యువాత

చింతలమానెపల్లి(సిర్పూర్‌): వర్షాకాలం వచ్చిందంటే చింతలమానెపల్లి మండలం దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. ప్రధాన రహదారి నుంచి వచ్చే మార్గం నీటిలో మునిగిపోతుంది. ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. వరద కష్టాలు తీర్చాలని ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చింతలమానెపల్లి మండల కేంద్రం నుంచి గూడెం మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిలో కేతిని నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో దిందా గ్రామం ఉంది. దట్టమైన అటవీప్రాంతంలోని ఈ గ్రామానికి రెండు వైపులా ప్రాణహిత నది ఉండగా, మరోవైపు వాగు ఉంది. ప్రజలు బయటకు రావాలంటే కేతిని వైపు, చిత్తం వైపు వాగు దాటాల్సిందే. ఏటా వర్షాకాలంలో జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు వర్షాలకు లోలెవన్‌ వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచిపోతాయి. మహారాష్ట్రలో కురిసే వర్షాలతోనూ ప్రాణహిత ఉప్పొంగి లోలెవల్‌ వంతెన మునిగిపోతుంది. దాదాపు మూడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తు వరకు వరద నిలుస్తుంది. రోజుల తరబడి పరిస్థితి అలాగే ఉంటే ప్రాణాలకు తెగించి గ్రామస్తులు వాగు దాటుతున్నారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల సైతం రోజుల తరబడి మూసి ఉంటుంది. వాగుకు అవతలి వైపు పొలాలకు వెళ్లాలంటే రైతులు సాహసం చేయాల్సిందే.. అంబులైన్స్‌ రాని దుస్థితి నెలకొంది.

ఈత వచ్చినా ఇబ్బందే..

ఎంబీఏ చదువుతున్న డోకె రామకృష్ణ అనే యువకుడు 2015లో వాగు దాటుతూ మృతి చెందాడు. తాజాగా కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్‌ గురువారం వాగులో గల్లంతు కాగా, శుక్రవారం మృతదేహం లభ్యమైంది. దిందా వాగు ఉధృతిగా ఉన్నప్పుడు దాటడం కష్టమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కోచోట వెడల్పుగా, మరోచోట ఇరుకుగా ఉంటూ వరద సుడులు తిరుగుతుంటుందని చెబుతున్నారు. గతంలో మృతి చెందిన రామకృష్ణ వాగులో సగం దూరం ఈదుకుంటూ రాగా.. ఆ తర్వాత ఉధృతిలో చిక్కుకున్నాడు. మరో యువకుడు సుమన్‌ సైతం గట్టుకు చేరుకునేలోపే కొట్టుకుపోయాడు.

పోరుబాట పట్టినా..

వాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి రూ.3కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీశాఖ అనుమతులు మంజూరు కాలేదు. రెండేళ్ల క్రితం వాగు వద్ద వరదనీటిలో గ్రామస్తులు ధర్నా చేశారు. వారం పాటు నిరసన తెలిపారు. స్పందించిన అధికారులు వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చి వెళ్లారు. అయినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. గతేడాది యువకులు వంతెనకై పోరుదీక్ష పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామం నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఉన్నతాధికారుల నుంచి హామీ వచ్చినా వంతెనకు మోక్షం కలగలేదు. గతేడాది అటవీ శాఖ అనుమతులు లభించినట్లు ప్రజాప్రతినిధులు ప్రకటించారు. కానీ నిధులు సరిపోవంటూ కాంట్రాక్టర్‌ పనులు చేపట్టడం లేదు.

వంతెన నిర్మించాలి

దిందా వాగు లోలెవల్‌ వంతెనపై వరద ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నాం. ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం హైలెవల్‌ వంతెన నిర్మించాలి.

– నికాడే వెంకన్న, దిందా

కాంట్రాక్టు రద్దు చేయండి

కాంట్రాక్టర్‌ పనుల్లో అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే నిజమైతే కాంట్రాక్టు రద్దు చేసి అతడిపై చర్యలు తీసుకోవాలి. త్వరగా రీటెండర్‌ నిర్వహించాలి. అప్పటివరకు ప్రజలు వాగు దాటేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి.

– డోకె రామన్న, బీజేపీ మండలాధ్యక్షుడు

తీరని ‘దిందా’ కష్టాలు!1
1/2

తీరని ‘దిందా’ కష్టాలు!

తీరని ‘దిందా’ కష్టాలు!2
2/2

తీరని ‘దిందా’ కష్టాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement