
ప్రాణహిత ప్రాజెక్టుపై కాలయాపన చేయొద్దు
కౌటాల(సిర్పూర్): ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయొద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు అనేవారికి ఈ వరద నీటిని చూసి కనువిప్పు కలగాలన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి దిగువనున్న గోదావరిలోకి ఇప్పటికే 40 టీఎంసీల నీరు కలిసిందని, ఇక్కడ ఏటా 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నిర్మిస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు డీపీఆర్ కూడా సిద్ధం చేయలేదన్నారు. అంతకుముందు కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల, వీర్ధండిలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ ప్రమోద్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవ య్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఎంపీడీవో రమేశ్, ఏపీఎం ముక్తేశ్వర్, ఏపీవో పూర్ణిమ, జిల్లా కార్యదర్శి బండి రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు కుంచాల విజయ్, మాజీ ఎంపీటీసీ మోతిరాం, నాయకులు తిరుపతి, రవి, మధుకర్, భూమయ్య, మహేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు.