
తలసేమియా, సికిల్‌సెల్ నివారణే లక్ష్యం
ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: తలసేమి యా, సికిల్‌సెల్‌ను 2047 వరకు పూర్తిగా నివారించడమే లక్ష్యమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి గణేశ్ నాగరాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఎంహెచ్‌వో సీతారాం, డీటీడీవో రమాదేవి, తలసేమియా, సికిల్‌సెల్ నోడల్ అధికారి వినోద్, ఆరో గ్య, ఆశ కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి గురువారం సమావేశం నిర్వహించారు. అలాగే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అధికారులతో కలిసి గిరిజనులకు అందుతున్న సంక్షేమ పథకాలపై సమీక్షించారు. ఆ యన మాట్లాడుతూ తలసేమియా, సికిల్‌సెల్ నివారణే లక్ష్యంగా ఈ నెల 30 వరకు గిరిజన గ్రా మాల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 102 గిరిజన గ్రామాల్లో పీఎం జుగా కింద శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సికిల్‌సెల్, రక్తహీనత బారిన పడిన పిల్లల జీవితాలను రక్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ పీఎం జన్‌మన్, జుగా కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గిరిజన గ్రామాల్లో రక్తహీనత, పోషకాహార లోపాలు అధిగమించేందుకు ఇప్పపువ్వు లడ్డూ, ఇతర పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10 మొబైల్ మెడికల్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి జిల్లాలోని అన్ని పీవీటీజీ గ్రామాల్లోని ప్రజలకు వైద్యపరీలు నిర్వహించామన్నారు. జిల్లాలోని 16 మంది తలసేమియా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు.