
కష్టాల కడలిలో కౌలు రైతు
● పెరిగిన విత్తన, ఎరువుల ధరలు ● ఏటా పెరుగుతున్న కౌలు ● పంట విక్రయంలోనూ ఇబ్బందులు ● జిల్లాలో 30వేలకు పైగా కౌలు రైతులు
తిర్యాణి: జిల్లాలోని కౌలు రైతులకు ఏటా కష్టాల కడలి ఈదక తప్పడం లేదు. పెరుగుతున్న కౌలు ధ రలతో పాటు ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతుండడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. కౌలు రైతులు ఇప్పటికే భూ యజమానులకు డబ్బులు చెల్లించి ఆయా భూముల్లో పనులు ప్రారంభించారు. కౌలు రైతులకు ప్రభుత్వ సహకారం అంతంతమాత్రమే కావడంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చి మరీ పంటలు సాగు చేస్తుండడంతో వారిపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతోంది.
ప్రభుత్వ పథకానికి దూరం..!
సాధారణంగా భూమిలేని వారితో పాటు అరఎక రం, ఎకరం భూమి ఉన్నవారు ఇతర రైతుల వద్ద నుంచి భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా కౌలు రైతుల కోసం ఆత్మీయ భరోసా పేరిట రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. భూమి లేని నిరుపేద కుటుంబాలై, ఉపాధిహామీ పథకంలో 20 రోజుల పనిదినాలు పూర్తి చేసిన వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. దీంతో జిల్లాలో సగానికి పైగా కౌలు రైతులకు ఈ పథకం ఉపయోగపడడం లేదని ఆరోపణలున్నాయి. కాగా జిల్లాలో దాదాపు 30వేలకు పైగా కౌలు రైతులు ఉన్నారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
రూ. 15వేల వరకు ధర..
మూడేళ్ల క్రితం వరకు కౌలు ధరలు అంతంత మా త్రంగానే ఉండేవి. కానీ క్రమంగా కౌలు ధరలు పె రుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ. 8 వేల నుంచి రూ.15 వేల వరకు కౌలు ధర ఉంది. రా ష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతుభరోసా, కేంద్ర ప్ర భుత్వం అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి భూ య జమానులకే దక్కుతోంది. దీంతో కౌలు రైతులకు ఆర్థికసాయం అందని ద్రాక్షగానే మిగులుతోంది.
చివరిదాక కష్టాలే..
కౌలు రైతుకు సీజన్ ప్రారంభం నుంచి సీజన్ పూర్తయ్యే వరకు కష్టాలే ఎదురవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు కొనుగోలుతో పాటు పంటలను విక్రయించేందుకు సైతం పట్టాదారు పాసు పుస్తకాలు తప్పనిసరిగా మారాయి. ఈ క్రమంలో పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్‌లు ఇచ్చేందుకు భూ యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం, పండించిన పంటను అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించి కౌలు రైతులు మోసపోతున్నారు. పంట పెట్టుబడి కోసం బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. దీంతో పాటు ఒక్కోసారి ప్రకృతి ప్రకోపానికి సాగు చేసిన పంటలను నష్టపోతుండడంతో కౌలు రైతుకు ఆశించిన ఫలితం రావడం లేదు.
ఐదెకరాల్లో కౌలు చేస్తున్నా..
నాకు ఎకరం భూమి ఉంది. మా ఊళ్లోనే మరో ఐదెకరాలను రూ. 50 వేలకు కౌలుకు తీసుకొని పత్తి పంట వేసిన. కౌలు డబ్బులు కాకుండా పంట సాగుకు రూ.90 వేల వరకు ఖర్చవుతోంది. మొత్తంగా ఐదెకరాల్లో పత్తి సాగుకు రూ.1.40 లక్షలు ఖర్చు వస్తుంది. అకాల వర్షాలతో వచ్చిన కాత సరిగా కాయకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. గత ఏడాది పంట దిగుబడి రాక రూ. 20 వేలు నష్టపోయాను. ప్రభుత్వం రైతుభరోసా ఇచ్చి ఆదుకోవాలి.
– కోట సుభాష్, కౌలు రైతు,
దుగ్గపూర్, మం. రెబ్బెన

కష్టాల కడలిలో కౌలు రైతు