
అటవీ అనుమతుల జారీకి ప్రత్యేక చర్యలు
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అవసరమైన అటవీ అనుమతుల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నా రు. శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క, అటవీ శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి నదీంతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఆర్‌డీవో లోకేశ్వర్, సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అటవీ శాఖ అనుమతుల జారీ, అటవీ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల పరిధిలో చేపట్టే రహదారి నిర్మాణ పనులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. జిల్లా అటవీ అధికారులతో సమీక్షించి చేపట్టిన చర్యలు, పనుల పురోగతిపై ఈ నెల 28వ తేదీలోగా నివేదిక అందించాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్‌దోత్రే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ జిల్లాలో చేపట్టే రహదారుల అభివృద్ధి పనులలో అవసరమైన అటవీ అనుమతుల కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.