
ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని బురదగూడ గ్రామానికి గత కొద్దిరోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదని శనివారం కాగజ్‌నగర్ –ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై గ్రామస్తులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా తమకు మిషన్ భగీరథ నీరు రావడంలేదని, ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఎంపీడీవో కోట ప్రసాద్ స్పందించి గ్రామానికి చేరుకుని పరిశీలించారు. బురదగూడ గ్రామానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేశారు. అదేవిధంగా పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు.