
లారీలు రాక.. ధాన్యం కదలక
అకాల వర్షానికి మొలకలు వచ్చిన వరి ధాన్యాన్ని చూపుతున్న ఈ రైతు పేరు పోతురాజుల సుగుణాకర్. భీమిని మండలంలోని కేస్లాపూర్ గ్రామం. దహెగాం మండలం బొర్లకుంట శివారు సుమారు ఎనిమిది ఎకరాల్లో దొడ్డురకం వరి సాగు చేశాడు. కోతలు పూర్తయిన తర్వాత బొర్లకుంటలో వారం రోజులు ఆరబెట్టి.. పదిరోజుల క్రితం దహెగాం కొనుగోలు కేంద్రానికి తరలించాడు. మూడు రోజుల క్రితం అకాల వర్షానికి వడ్లు తడిసాయి. బుధవారం మరోసారి తడవడంతో మొలకలు కూడా వచ్చాయి. ‘ప్రైవేటుకు అమ్ముకున్నా మంచిగ ఉంటుండే.. సర్కారు కేంద్రంలో అమ్మితే ధర వస్తదని అనుకుంటిని.. వానతో ఇరవై బస్తాల వరకు నష్టం వాటిల్లింది..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా.. కొనుగోళ్లలో జాప్యం కారణంగా జిల్లా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
దహెగాం(సిర్పూర్): జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతాంగాన్ని నిండా ముంచుతున్నాయి. సోమవారం కురిసిన వర్షంతో ధాన్యం ఓసారి తడిసిపోగా, బుధవారం మరోసారి కురిసిన భారీ వర్షానికి మరోసారి తడిసింది. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే మొలకలు వస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఓ వైపు జిల్లా ఉన్నతాధికారులు ప్రతిరోజూ కేంద్రాలను తనిఖీ చేస్తూ నిర్వాహకులకు చెబుతున్నారు. కానీ కాంటా పూర్తయిన తర్వాత బస్తాలు మిల్లులకు తరలించడానికి లారీలు పంపించడంలో శ్రద్ధ చూపడం లేదు. తరలించిన ధాన్యాన్ని సైతం మిల్లర్లు త్వరగా అన్‌లోడ్ చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి జల్లులు పడినా ధాన్యం పంపకండి అంటూ కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు.
10 మిల్లులకు ధాన్యం..
జిల్లాలో 20వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, కొనుగోళ్ల కోసం 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 55 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికొచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేయగా, పౌరసరఫరాల శాఖ 10 వేల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటి వరకు 3,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పది మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. గురువారం మన జిల్లాలోనే కాకుండా పెద్దపల్లిలోని మిల్లులకు సైతం ట్యాగింగ్ ఇచ్చి వడ్లు తరలించారు. బుధవారం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలను సైతం పంపించారు. అయితే అక్కడి మిల్లుల నిర్వాహకులు ఏమైనా కోత విధిస్తారా.. అనే సందేహం రైతుల్లో నెలకొంది. తేమ శాతం పెరిగే అవకాశం ఉండటంతో ఎలాంటి కొర్రీలు విధిస్తారో అంటూ చర్చించుకుంటున్నారు. షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి వరకు వర్షం పడగా, మరో మూడు రోజులపాటు పడే అవకాశం ఉండటంతో కొనుగోళ్లు వేగవంతం చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం
కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న వడ్లు

లారీలు రాక.. ధాన్యం కదలక