రూ.పదివేలు ఇస్తేనే హాల్‌టికెట్‌! | - | Sakshi
Sakshi News home page

రూ.పదివేలు ఇస్తేనే హాల్‌టికెట్‌!

May 9 2025 1:26 AM | Updated on May 9 2025 1:26 AM

రూ.పదివేలు ఇస్తేనే హాల్‌టికెట్‌!

రూ.పదివేలు ఇస్తేనే హాల్‌టికెట్‌!

● బీఈడీ కళాశాలలో ఫీజుల దోపిడీ ● కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ బీఈడీ కళాశాల ఫీజుల దోపిడీకి పాల్పడుతోంది. శిక్షణ ఉపాధ్యాయులకు ఈ నెల 12 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా, అదనంగా రూ.10వేలు కడితేనే హాల్‌టికెట్‌ ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్‌ వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో కాలేజీ వద్ద ఆందోళన తెలిపారు.

అటెండెన్స్‌ పేరుతో వసూళ్లు..

జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ కళాశాలలో రెండేళ్ల బీఈడీ కోర్సులో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉండే పీజీ, యూజీ కళాశాలల నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ఎలాంటి ట్యూషన్‌, స్పెషల్‌ ఫీజులు తీసుకోవద్దు. అలాగే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, పరీక్షల హాల్‌టికెట్లు కళాశాల యాజమాన్యం తన వద్ద ఉంచుకోవద్దు. కానీ జిల్లాకేంద్రంలో బీఈడీ కాలేజీ యాజమాన్యం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సా ధారణంగా మేనేజ్‌మెంట్‌ కోటా కింద 20శాతం, కన్వీనర్‌ కోటా కింద 80శాతం సీట్లు భర్తీ చేయాలి. కానీ ప్రత్యేక అనుమతితో 70 మంది వరకు మేనేజ్‌మెంట్‌ కోటా కింద అడ్మిషన్‌ పొందారు. వీరికి యూనివర్సిటీ నిబంధన ప్రకారం రూ.78,000 ఫీజు ఉంది. కానీ విద్యార్థుల నుంచి అదనంగా రూ.10వేలు అటెండెన్స్‌ ఫీజు పేరుతో వసూలు చేస్తున్నారు.

విద్యార్థులకు బెదిరింపులు..!

కళాశాలలో గురువారం ప్రాక్టికల్‌ పరీక్షలు ముగియగా, ఈ నెల 12 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే 200 మంది రూ.10 వేల చొప్పున అదనంగా చెల్లిస్తేనే హాల్‌ టికెట్‌ ఇస్తామని, లేకుంటే ప్రాక్టికల్‌ చివరి పరీక్షకు గైర్హాజరైనట్లు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్‌ తల్లిదండ్రులకు అసభ్యకర రీతిలో సందేశాలు పంపుతున్నారని ఆరోపిస్తున్నారు. గురువారం కళాశాలలో సిబ్బందిని ‘సాక్షి’ ప్రశ్నించగా యాజమాన్యం సూచించిన విధంగా ఫీజులు వసూలు చేస్తున్నామని, అంతకు మించి తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement