
జిల్లాలో పోక్సో కేసుల వివరాలు
బెజ్జూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13) ఏప్రిల్ 7న దహెగాం మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న మేనత్త ఇంటికి వచ్చింది. అదే రోజు వరుసకు మామ అయిన వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నీరసంగా ఉండడంపై తల్లిదండ్రులు ఆరా తీయడంతో జరిగిన విషయం తెలిసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ 22న దహెగాం మండలం ఓ గ్రామానికి చెందిన బాలిక(11) తల్లిదండ్రులు పనికోసం చేనుకు వెళ్లారు. బాలిక ఇంటి వద్ద తన చెల్లిని ఆడిస్తుండగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.
కౌటాల(సిర్పూర్): జిల్లాలో బాలికలపై కామాంధుల దుశ్చర్యలు కలకలం రేపుతున్నాయి. పసిమొగ్గలపై పైశాచికత్వం రోజురోజుకూ పెట్రేగిపోతుంది. గంజాయి, మద్యం మత్తులో కామాంధులు వావివరసలు మర్చిపోతున్నారు. పిల్లలు అని కూడా చూడకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల వరుసగా జిల్లాలోని దహెగాం మండలంలో ఇద్దరు బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడిన ఘటనల్లో పోలీసులు పోక్సో కేసులు నమోదు చేశారు.
పెరుగుతున్న అఘాయిత్యాలు..
దేశంలో ఎన్ని చట్టాలున్నా.. పోలీసు భద్రత ఉన్నా బాలికలకు రక్షణకు కరువవుతోంది. జిల్లాలో మైనర్లపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. వీటిలో కొన్ని వెంటనే వెలుగులోకి వస్తుండగా.. మరికొన్ని ఇతర కేసుల విచారణ సమయంలో, లేక బాధితులు అనారోగ్యానికి గురైనప్పుడో వెలుగుచూస్తున్నాయి. పరువుపోతుందన్న భయంతో కొందరు తల్లిదండ్రులు ఘటనలను దాచిపెడుతున్నారు. నిందితులు తెలిసిన వారై ఉండటం, పోలీసుల దృష్టికి వెళ్తే.. బయటకు వచ్చాక మళ్లీ వేధిస్తారన్న భయంతో ఫిర్యాదు కూడా చేయడం లేదు. పోక్సో చట్టంపై మరింత అవగాహన కల్పించాల్సి ఉండగా, బాలికల రక్షణకు సర్కారు ఇంకొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. తల్లిదండ్రులు సైతం పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలని అధికారులు సూచిస్తున్నారు.
యువకులే అధికం..
మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్న కేసులో ఈ నెల 1న జిల్లా కోర్టు వంజిరిగూడ గ్రామానికి చెందిన చంద్రకాంత్ అనే నిందితుడికి పదేళ్ల ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. అలాగే మైనర్ బాలికను మోసం చేసిన పోక్సో కేసులో ఆసిఫాబాద్ మండలం పర్శనంబాల గ్రామానికి చెందిన గెట్కర్ శ్రీకాంత్‌కు జిల్లా కోర్టు ఏప్రిల్ 24న జీవిత ఖైదుతో పాటు రూ.60 వేల జరిమానా విధించింది. పోక్సో కేసుల్లో పోలీసులు, కోర్టులు కఠినంగా వ్యవహరిస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి కేసుల్లో చాలా వరకు లైంగిక దాడులు క్షణికావేశం, మద్యం మత్తులోనే జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇందులోనూ యువకులే ఎక్కువగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ, సెల్‌ఫోన్లు, సినిమాల ప్రభావం ఇలాంటి ఘటనలపై ప్రభావం చూపుతోంది. తెలిసీతెలియని వయస్సులో పిల్లలు స్మార్ట్‌ఫోన్లలో అశ్లీల వెబ్‌సైట్లు, వీడియోలు చూస్తూ చెడుమార్గాన్ని అనుసరిస్తున్నారు. నేరాలకు పాల్ప డి జీవితం నాశనం చేసుకుంటున్నారు.
పసిపిల్లలపై పైశాచికత్వం
కఠిన శిక్షలున్నా కామాంధుల్లో మార్పు కరువు
ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
చిన్నారులకు అండగా పోక్సో చట్టం
పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే..
పిల్లల బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలి. వారి కదలికలు, దినచర్యలో వారు ఏం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు. వారి స్నేహితుల వివరాలు తెలిసి ఉండాలి. సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కల్పించాలి. బాలిక రక్షణ చట్టాలపై కళా శాలలు, పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. వేధించినా, ఇబ్బందులకు గురిచేసినా రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీం ఉంది. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారు.
– రామానుజం, డీఎస్పీ, కాగజ్‌నగర్
పట్టింపు అవసరం
చాలా ఘటనల్లో తెలిసినవారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇందుకు దహెగాం ఘటనే నిదర్శనం. తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా వదలకుండా కనిపెట్టుకుని ఉండాలి. వారి ప్రవర్తనలో తేడాలు గమనిస్తే కారణాలు తెలుసుకోవాలి. పాఠశాల, కళాశాలకు పంపినప్పుడు అక్కడికి చేరుకున్నారో? లేదో విచారించుకోవాలి.
ఎవరైనా ప్రేమగా మాట్లాడినా, ఆటలు ఆడినా.. చిన్నారులు వారి దగ్గరకు వెళ్తారు. అంద రూ మనవారే అనే భావనలో ఉంటారు. మంచితనం ముసుగులో కొంతమంది లైంగిక దా డులకు తెగబడుతున్నారు. బాలికలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి.
ఇంట్లో మగ పిల్లలు ఉంటే వారికి మహిళలు, బాలికలను ఎలా గౌరవించాలో తెలియజేయాలి. తమ శరీరంలోని సున్నితమైన భాగా లను ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే ఎలా ప్రవర్తించాలో తెలపాలి. ఆడపిల్లలకు అవసరమైతే ఆత్మరక్షణకు కరాటే, కుంగ్‌ఫూ వంటివి నేర్పించాలి.
పిల్లలతో రోజూ కొంత సమయం గడుపుతూ వారు చెప్పే విషయాలు శ్రద్ధగా వినాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చట్టాల గూర్చి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి చైతన్యం చేయాలి.
18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే అత్యాచారాలు, వేధింపులపె పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. కనీసం మూడేళ్లకు తగ్గని జైలు శిక్ష, అత్యధికంగా జీవితఖైదు, అవసరమైతే జరిమానా కూడా విధిస్తారు.

జిల్లాలో పోక్సో కేసుల వివరాలు