బీసీ మేల్కొలుపు రథయాత్ర ప్రారంభం
వాంకిడి(ఆసిఫాబాద్): బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘మేమెంతో మాకంత’ నినాదంతో సోమవారం మండల కేంద్రం నుంచి బీసీ మేల్కొలుపు రథ యాత్ర ప్రారంభించారు. అంతకుముందు మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో ప్రజాసంఘాలు, వివిధ కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కాని సంజయ్‌కుమార్ మాట్లాడుతూ బీసీ లు అన్నిరంగాల్లో వెనుకడి ఉన్నారన్నారు. ప్రభుత్వాలు జనాభా ప్రతిపాదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సామాజిక ఉద్యమ పితామహుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ఆయన స్వగ్రామం వాంకిడి నుంచి బీసీ మేల్కొలుపు రథయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ రథయాత్ర అలంపూర్‌లో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు.


