ఆసిఫాబాద్: మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనవి కిడ్నీలు. అవి సక్రమంగా పనిచేస్తేనే శరీరం నుంచి వ్యర్థాలు బయటికి వెళ్లి ఆరోగ్యంగా ఉంటారు. కానీ మారిన ఆహారపు అలవాట్లు, వివిధ అనారోగ్య సమస్యలతో కొంతమంది మూత్రపిండాలు చిన్నవయస్సులోనే దెబ్బతింటున్నాయి. గతంతో పోలిస్తే జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. గురువారం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కథనం.
వందమంది బాధితులు
డీహైడ్రేషన్, పెయిన్ కిల్లర్లు అధికంగా వినియోగించడం, ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, ఆటోఇమ్యున్ వ్యాధితో పాటు జన్యుపరమైన సమస్యలతో మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌ను దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అంటారు. కిడ్నీలు 80 శాతం వరకు పాడయ్యే వరకు పనిచేస్తాయి. ఇందులో ఐదు దశలు ఉండగా, చివరి దశకు చేరితే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు భావిస్తారు. జిల్లావ్యాప్తంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో వంద మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బాధితులకు సేవలందించేందుకు జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఐదు డయాలసిస్ మిషన్లు ఉన్నాయి. ఆసిఫాబాద్‌లో 40 మంది, కాగజ్‌నగర్‌లో 40 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.
స్లాట్ దొరక్కపోతే ఇతర ప్రాంతాలకు..
కొంతమంది వ్యాధిగ్రస్తులకు స్లాట్ బుకింగ్ దొరక్కపోవడంతో మంచిర్యాల, కరీంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆర్థిక స్థామత ఉన్న కొంతమంది మంది హైదరాబాద్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఒక్కొసారి డయాలసిస్ కోసం రూ.6 వేలు వెచ్చించాల్సి వస్తుంది. వారానికి రెండుసార్ల చొప్పున నెలకు ఎనిమిది సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉటుంది. ఇందుకు నెలకు సుమారు రూ.50 వేలు ఖర్చవుతుంది. బతుకుపై ఆశతో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఆస్తులు అమ్ముకుని చికిత్స చేయించుకుంటున్నారు. కిడ్నీ సమస్య ముదిరితే అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం కూడా జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన ఓ బాధితుడు మృతి చెందాడు.
జిల్లా కేంద్రంలోని డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులు(ఫైల్)
జాగ్రత్తలు పాటించాలి
హైబీపీ, డయాబెటీస్, కుటుంబంలో ఎవరికై న కిడ్నీవ్యాధిగ్రస్తులు ఉంటే తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురైతే తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అవసరం లేకున్నా ఒత్తిడిగా అనిపించడం, ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం వ్యాధికి సంకేతంగా భావించాలి.
షుగర్ వ్యాధితో బాధపడేవారిలో 40 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.
మూత్రంలో ప్రోటీన్లు పోవడం క్లిష్టమైన అంశం. మూత్ర పరీక్షల ద్వారానే గుర్తిస్తారు. అనుమానం ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
మూత్రంలో రక్తం వస్తుంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.