ఆసిఫాబాద్‌అర్బన్: మహిళల అభ్యున్నతి, రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా సీ్త్ర, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు బ్యాంకు లింకేజీ ద్వారా స్వశక్తి మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గృహ హింస, లైంగిక వేధింపుల బాధితులకు సఖి కేంద్రం ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బేటీ పడావో.. బేటీ బచావో కార్యక్రమం ద్వారా బాలికల్లో అక్షరాస్యత పెరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో మోటివేషన్ స్పీకర్లను నియమించినట్లు తెలిపారు. భావితరాలకు మహిళలు ఆదర్శంగా నిలవాలని, ఉన్నత లక్ష్యాలు సాధించాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సూచించారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబం, సమాజం వారిని గుర్తిస్తుందన్నారు. ఆత్మ నూన్యత భావన విడిచి ముందడుగు వేయాలని సూచించారు. భ్రూణ హత్యలు, బాల్యవివాహా లు అరికట్టినప్పుడే సమాజం అభివృద్ధి వైపు పయనిస్తుందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, సీడీపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళల అభ్యున్నతికి చర్యలు