దాహం తీరేదెలా..? | - | Sakshi
Sakshi News home page

దాహం తీరేదెలా..?

Mar 12 2025 7:59 AM | Updated on Mar 12 2025 7:53 AM

● జిల్లాలో మండుతున్న ఎండలు ● అటవీ ప్రాంతాల్లో నీటి కరువు ● తాగునీటి కోసం మైదాన ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ● పొంచి ఉన్న వేటగాళ్ల ముప్పు

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. వేడి, పొడి వాతావరణంతో అడవుల్లోని సహజ నీటి వనరులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఫలితంగా అటవీ ప్రాంతాలను ఆవాసంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. ఎండలు మొదలై 15 నుంచి 20 రోజులవుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నీటి వసతి కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. దాహానికి తట్టుకోలేక వన్యప్రాణులు నీటి వనరులను వెతుక్కుంటూ అడవులను విడిచి మైదాన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో అటవీ జంతువులు వేటగాళ్ల ఉచ్చులకు చిక్కుతున్నాయి. అలాగే వీధికుక్కల దాడిలోనూ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.

6,04,172 ఎకరాల్లో అడవులు

జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ఫారెస్టు డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లలో 11 రేంజ్‌లు, 79 సెక్షన్లు, 245 బీట్లు, 846 కంపార్టుమెంట్లు ఉన్నా యి. జిల్లావ్యాప్తంగా 6,04,172 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. పెద్దపులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, జింకలు, మెకాలు, దుప్పులు, నీలు గాయి, కొండగొర్రెలు, అడవి పందులతోపాటు అనేక రకాల అరుదైన జంతువులు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో గడ్డి మైదానా లు, నీటి ఊటలు ఉన్నాయి. నిత్యం నీటితో కళకళలాడే పెన్‌గంగ, ప్రాణహిత నదులు, పెద్దవాగు వ న్యప్రాణుల దాహం తీరుస్తున్నాయి. జిల్లాలోని ము ఖ్యమైన ప్రాంతాల్లో అటవీ జంతువుల దాహం తీ ర్చడానికి అధికారులు 159 సాసర్‌పిట్లు, 19 సోలా ర్‌ నీటి కుంటలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వేసవిలో నీటి వనరులు అడుగంటిపోతాయి. ఈ సమయంలో అధికారులు ఏర్పాటు చేసే నీటికుంటలు, సాసర్‌ పిట్‌లే వాటికి ఆధారం.

పొంచి ఉన్న ముప్పు..

ఎండాకాలంలో అడవి జంతువులకు నీటి సౌకర్యం కల్పించడం, వేటగాళ్ల బారి నుంచి కాపాడటం అఽధికారులకు సవాలుగా మారింది. అడవుల నుంచి దాహంతో మైదాన ప్రాంతాల్లోకి వస్తున్న వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉంది. నిరంతరం నీరు లభించే ప్రాంతాలు వేటగాళ్లకు అనుకూలంగా మారాయి. నీటివసతి ఉన్న ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు, ఉచ్చులు బిగించి వన్యప్రాణులను వేటాడుతున్నారు. మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్చిలోనే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వేడికి అల్లాడుతున్న వన్యప్రాణులు ఏప్రిల్‌, మేలో వేటగాళ్ల ఉచ్చులకు బలయ్యే అవకాశం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

పెంచికల్‌పేట్‌ రేంజ్‌లో నీరు లేక ఖాళీగా ఉన్న సాసర్‌పిట్‌

జిల్లా వివరాలు

ఫారెస్టు సాసర్‌ సోలార్‌ రేంజ్‌లు పిట్లు కుంటలు

పెంచికల్‌పేట్‌ 15 5

బెజ్జూర్‌ 26 1

కాగజ్‌నగర్‌ 22 8

సిర్పూర్‌(టి) 22 2

కర్జెల్లి 29 1

రెబ్బెన 10 2

ఆసిఫాబాద్‌ 15 0

జోడేఘాట్‌ 5 0

కెరమెరి 5 0

తిర్యాణి 5 0

గిన్నెధరి 5 0

ఖాళీగా సాసర్‌పిట్లు..

వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ఆయా రేంజ్‌ల పరిధిలో ఏర్పాటు చేసిన నీటికుంటలు, సాసర్‌పిట్లు, సోలార్‌ నీటి కుంటలు అలంకారప్రాయంగా కనిపిస్తున్నాయి. సాసర్‌పిట్లలో ట్యాంకర్ల ద్వారా వారం రోజులకు ఒకసారి నీటితో నింపాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వన్యప్రాణుల కోసం ఉప్పుగడ్డలు మాత్రం నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏడాదిగా కంపా నిధులు నిలిచిపోవడంతో అడవి జంతువుల దాహార్తి తీర్చడం అటవీశాఖ అధికారులకు భారంగా మారింది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం

ఎండల తీవ్రతతో అడవిలోని సహజ వనరులు ఎండిపోతున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రదేశాల్లో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నెలాఖరు వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు రాగానే సాసర్‌పిట్లలో నీటిని నింపే ప్రక్రియ ప్రారంభిస్తాం. వన్యప్రాణులు మైదాన ప్రాంతాల్లోకి వస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. వన్యప్రాణులను వేటాడితే కేసులు నమోదు చేస్తాం.

– అనిల్‌కుమార్‌, ఎఫ్‌ఆర్‌వో, పెంచికల్‌పేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement