తాగునీటి సమస్య రావొద్దు
ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం
జలాశయాల్లో నిల్వలు
తాగునీటికే ప్రాధాన్యత
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంసహకారనగర్: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, మట్టా రాగమయితో కలిసి పలు శాఖల అధికారులతో వానాకాలం సాగు ప్రణాళిక, ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసిందని, జిల్లా జలాశయాల్లోని నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
సిద్ధంగా విత్తనాలు
రైతులు ఉద్యాన పంటలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలు సాగు చేసేలా ప్రోత్సహిస్తూ అందుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. రైతులు సాగు చేసే ప్రత్యామ్నాయ పంటల కొనుగోళ్లను కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని భరోసా ఇచ్చారు. అధికారులు కూడా ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేసి రైతులకు అవగాహన కల్పించాలని, వర్షపాతం వివరాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతేకాక నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. కల్లూరులో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఈ ఏడాదే ప్రారంభమవుతుందని చెప్పారు. కొందరు రైతులు వరి కొయ్యలు, పంట అవశేషాలు కాలుస్తుండడంతో ఆస్తి, ప్రాణనష్టం జరుగుతున్నందున అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకుండా కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఇక సీతారామ ఎత్తిపోతల పథకంలోని జూలూరుపాడు టన్నెల్ పనులకు అవసరమైన అటవీ అనుమతులు పొందాలన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి.. నగర సుందరీకరణ, మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణ అమలు చేయాలని తెలిపారు. అలాగే, యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పూర్తి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, మెడికల్ కాలేజీ భవనాలు, ఖమ్మం మార్కెట్‌లో అభివృద్ధి పనులు, శిల్పారామం పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణంపై మంత్రి సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. ఇంకా సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ, ఖమ్మం మార్కెట్ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ ఖాదర్‌బాబా, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.


