నిఘా పెంచాల్సిందే..
రౌడీయిజం, సెటిల్‌మెంట్లు,
భూకబ్జాలతో అక్రమ సంపాదన
అవసరాల నిమిత్తం వస్తే
ఇరువర్గాల నుంచి వసూళ్లు
పేరు వస్తుందనే భ్రమతో
అదే బాట పడుతున్న యువత
ఖమ్మంక్రైం: రౌడీలంటే ఒకప్పుడు అమాయకులపై రుబాబు చేసి బెదిరిస్తూ మామూళ్లు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, బెదిరింపులు, దాడులతో పలువురు అక్రమ ఆర్జనకు దిగుతున్నారు. అయితే వీరి సంపాదన చూసి చదువు మానేసి ఖాళీగా తిరుగుతున్న యువత పలువురు అదే బాట పడుతున్నారు. అక్రమ మార్గాల్లో సంపాదనకు అలవాటు పడి దురలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. ఫలితంగా జిల్లాలో రౌడీయిజం నానాటికీ పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఇతర చోట్లకు వెళ్లి మరీ..
ఖమ్మం ప్రాంతానికి చెందిన పలువురు రౌడీషీటర్లు తమ పరిధిని పెంచుకుంటున్నారు. జిల్లాలోనూ కాక హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాలకు వెళ్లి మరీ భూసెటిల్‌మెంట్లు చేస్తున్న ట్లు తెలిసింది. అక్కడి రౌడీషీటర్లతో పరిచయం పెంచుకుని దందాలు చేస్తూ అక్రమ సంపాదన పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
పని అయిపోయినట్లే..
సివిల్ పంచాయితీలకు సంబంధించి పలువురు నేరుగా రౌడీషీటర్లను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో వారు బార్లు, రెస్టారెంట్లు, దాబాలు, కేఫ్ ల్లో ఇరువర్గాలను కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లా కేంద్రంలో పలు పేర్లతో ఏర్పాటవుతున్న కేఫ్‌ల్లో ఇలాంటి వర్గాల వారే ఎక్కు వగా కనిపిస్తున్నారు. మాట వింటే సరి.. లేకపోతే బెదిరిస్తూ సింగిల్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని సమాచారం. ఇది ఆనోట ఈనోట ప్రచారం జరుగుతుండడంతో పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎవరు తిరుగుతారంటూ పలువురు రౌడీషీటర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా చాలా మంది రౌడీషీటర్లు బెదిరింపులనే ఉపాధిగా మార్చుకుంటున్నారు.
ఖాళీగా ఉంటున్న వారు..
జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లో చదువు మానేసి జులాయిగా తిరుగుతున్న వారు రౌడీయిజంపై మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. తల్లిదండ్రుల మాట లెక్కచేయకుండా రౌడీషీటర్ల వెంట సెటిల్‌మెంట్లకు వెళ్లి వారు ఇచ్చే డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంకొందరు మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని, భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.
జిల్లాలో రౌడీషీటర్లు, ఇతరుల గణాంకాలు
(పోలీసు రికార్డుల ఆధారంగా)
రౌడీషీటర్లు 230
డెకాయిట్ షీట్లు 51
కేడీ షీట్లు 09
సస్పెక్టెడ్ షీట్లు 601
సెటిల్‌మెంట్లు, భూదందాలు చేసే వారి కట్టడిపై ఇటీవల పోలీసు నిఘా తగ్గిందని విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా రాత్రివేళ రోడ్లపై జులాయిగా తిరిగే యువతపై ప్రత్యేక దృష్టి సారించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వటం వంటివి చేస్తే ఫలి తం ఉంటుంది. కానీ అలాంటివేవీ జరగకపోవడంతో జన్మదిన వేడుకలు ఇతరత్రా పేర్లతో రాత్రింబవళ్లు రోడ్లపై హడావుడి చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇకనైనా జిల్లాలోని రౌడీషీటర్లతో పాటు సస్పెక్టెడ్, డెకాయిట్ షీట్లు నమోదైన వారి కదలికలపై ప్రత్యేక నిఘా వేయాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో పెరుగుతున్న
రౌడీషీటర్లు


