ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ
పటిష్టతపై నేతల నజర్
సభ్యత్వ పర్యవేక్షణకు ఇన్‌చార్జ్‌ల నియామకం
ఎన్నికల దృష్ట్యా కేఎంసీని ప్రత్యేకంగా తీసుకున్న నేతలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) సభ్యత్వ నమోదుకు కసరత్తు ఊపందుకుంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు రంగంలోకి దిగాయి. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌గా బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వ్యవహరిస్తుండగా.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాక ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మండల ఇన్‌చార్జిలతో సమావేశాలు నిర్వహించి డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదుపై సూచనలు చేశారు.
నేతలకు దిశానిర్దేశం
బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు యాప్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమితులైన రవీందర్‌రావు.. మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంపీ నామ, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర తదితరులతో సమావేశమై సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఆపై నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను పార్టీ ప్రకటించి సభ్యత్వ నమోదుపై చర్చించారు. గ్రామం మొదలు జిల్లాస్థాయి వరకు సభ్యత్వ నమోదు చేపట్టనుండడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం నెలకొంది. సభ్యత్వ నమోదు తర్వాత సంస్థాగత కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
జోరుగా సాగేలా..
సభ్యత్వ నమోదు తేదీ ప్రకటించగానే ప్రారంభించేందుకు ఇన్‌చార్జ్‌లు సిద్ధంగా ఉన్నారు. డిజిటల్ యాప్‌నకు సంబంధించి కొందరికి హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు మండల, నియోజకవర్గాల స్థాయి నేతలకు కూడా శిక్షణ కొనసాగుతోంది. ఆపై నిర్దేశిత తేదీ నుంచి సభ్యత్వ నమోదు చేపట్టేలా నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌లోని మొత్తం కమిటీలను రద్దు చేసిన క్రమాన కొత్త కమిటీల్లో తగిన ప్రాధాన్యత దక్కించుకునేలా పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.
కేఎంసీలో మరింతగా..
బీఆర్‌ఎస్ సభ్యత్వాల విషయంలో ఖమ్మం కార్పొరేషన్‌పై నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. కార్పొరేషన్ పాలకవర్గ గడువు ఇటీవలే ముగియడంతో ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఈమేర కు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ పటిష్టంగా ఉండేలా మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.


