జిల్లాలో కోటాకు మించి వాడకం ఖమ్మం టౌన్, రూరల్, సత్తుపల్లిలో అధికం
ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరాయి. కొద్దిరోజులుగా జిల్లాలో 45 డిగ్రీలకుపైగా ఎండ తీవ్రత నమోదవుతోంది. ఈక్రమాన ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరగడంతో విద్యుత్ వినియోగం అదే స్థాయిలో పెరుగుతోంది. మే నెలలో ఎండలు ఎక్కువగా ఉండడం సహజమే అయినా, గత ఏడాదితో పోలిస్తే మరింత పెరగడంతో విద్యుత్ వినియోగం గరిష్టస్థాయికి చేరుతోంది. – ఖమ్మం వ్యవసాయం
తిరగాల్సిందే..
ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ఇవి ఉదయం మొదలు రాత్రి వరకు నిరంతరాయంగా తిరుగుతుండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎన్పీడీసీఎల్ నుంచి ప్రతీ సర్కిల్‌లో విద్యుత్ కనెక్షన్లు, కేటగిరీని పరిగణనలోకి తీసుకుని సీజన్ల వారీగా విద్యుత్ కోటా నిర్దేశిస్తారు. భూగర్భ జలాలు, జలాశయాల్లో నీరు ఉండడంతో ఈ యాసంగిలో రైతులు పెద్దమొత్తంలో పంటలు సాగు చేశారు. వీటికి మోటార్ల ద్వారా నీరు అందించే క్రమాన గరిష్టస్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. అయితే, ఈనెల మొదటి వారంకల్లా యాసంగి పంటల కోతలు పూర్తయ్యాయి. అయినా ఎండల ప్రభావంతో గృహ వినియోగం గణనీయంగా పెరగగా కోటాకు మించి విద్యుత్ వినియోగం జరుగుతోందని భావిస్తున్నారు.
అంతకు మించి....
ఖమ్మం విద్యుత్ సర్కిల్(జిల్లా) పరిధిలో 2025 ఏడాదికి మించి ఈ ఏడాది విద్యుత్ వినియోగం నమోదవుతోంది. 2025 మే నెలలో ఖమ్మం సర్కిల్‌కు నిత్యం 4.93 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశారు. ఈ కోటా ఆధారంగా మే 1నుంచి 20వ తేదీ వరకు 98.60 మిలియన్ యూనిట్లకు బదులు 99.17 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. అంటే కోటాకు మించి 0.57 మిలియన్ల యూనిట్లు ఎక్కువగా వినియోగించారు. ఇక ఈ ఏడాది మాత్రం కోటా తగ్గించి నిత్యం 4.83 మిలియన్ యూనిట్లుగా నిర్దేశించారు. కానీ ఈనెల 1 నుంచి 20వ తేదీ వరకు 96.56 మిలియన్ల యూనిట్లకు బదులు 104.34 మిలియన్ యూనిట్లు.. అంటే కోటాకు మించి 7.78 మిలియన్ యూనిట్లు ఎక్కువగా వినియోగించడం గమనార్హం.
మూడింట్లో ఎక్కువ..
రెండింట తక్కువ
జిల్లాలో ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, సత్తుపల్లి విద్యుత్ డివిజన్ల పరిధిలో కోటాకు మించి విద్యుత్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల విద్యుత్ డివిజన్ల పునర్విభజనలో భాగంగా మధిర డివిజన్ ఏర్పాటైంది. ఇందులోకి వైరా డివిజన్ నుంచి పలు ప్రాంతాలను కలపడంతో ఈ రెండు డివిజన్లలో కోటా కన్నా తక్కువ విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇదే సమయాన ఖమ్మం టౌన్‌లో మాత్రం గణనీయంగా పెరిగింది. ఈనెల 1 నుంచి 20వ తేదీ వరకు 23.34 మిలియన్ యూనిట్ల కోటాకు 37.13 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఖమ్మం రూరల్ డివిజన్‌లో అదనంగా 4.17 మిలియన్ యూనిట్లు, సత్తుపల్లి డివిజన్‌లో 6.43 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కోటాకు మించి వినియోగించారు. మరోపక్క వైరా, మధిర డివిజన్లలో కోటా కంటే తక్కువ వినియోగంతో ఆదా అయినట్లయింది.
ఎండల వేళ గరిష్టస్థాయిలో విద్యుత్ వినియోగం


