గ్రామదీపికల సేవలకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రామదీపికల సేవలకు బ్రేక్‌

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

● జీతాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం పోరుబాట ● ఐదు డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసనలు ● ప్రత్యామ్నాయాలపై యంత్రాంగం నజర్‌

● జీతాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం పోరుబాట ● ఐదు డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసనలు ● ప్రత్యామ్నాయాలపై యంత్రాంగం నజర్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళల ఆర్థికాభివృద్ధికి వారధిలా నిలిచే విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్ల (వీఓఏ–గ్రామదీపికలు) సమ్మె జిల్లాలో రోజురోజుకూ ఉధృతమవుతోంది. జేఏసీ పిలుపు లో భాగంగా ఐదు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈ నెల 18వ తేదీ నుంచి గ్రామదీపికలు చేపట్టిన నిరసనలు ఆదివారం ఏడోరోజుకు చేరాయి. సమ్మె ప్రభావంతో పొదుపు సంఘాల లావాదేవీలు, అంతర్గత లెక్కల నిర్వహణ, ఇతర పరిపాలనా సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి.

సమస్యల సుడిగుండంలో..

గ్రామాల్లో మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేయడం, వారికి అవసరమైన రుణాలు ఇప్పించడం, రికార్డులు, సమావేశాల నిర్వహణ బాధ్యతలను గ్రామదీపికలు నిర్వర్తిస్తుంటారు. దశాబ్దాలుగా సంఘాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న వీరు తమకు కనీస గౌరవం దక్కడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చేందుకు కృషి చేస్తున్నా తమ సమస్యలను పరిష్కరించడం లేదని వాపోతున్నారు.

ఇవీ డిమాండ్లు

ప్రస్తుత ధరల నేపథ్యాన తమకు ఇచ్చే రూ.5 వేలు గౌరవ వేతనం సరిపోవడం లేదని, దీన్ని రూ.20 వేలకు పెంచాలని వీఓఏలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాక వేతనాలను విలేజ్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా చెల్లిస్తుండడంతో ఇబ్బందిగా మారినందున ఆరు నెలలకోసారి ఇవ్వకుండా ప్రతినెలా ఖాతాల్లోనే జమ చేయాలని కోరుతున్నారు. అలాగే, ఉద్యోగ భద్రత, రూ.5 లక్షల బీమా, వివరాల నమోదుకు ఉచితంగా ట్యాబ్‌లను అందజేయాలని, అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వడమే కాక హెచ్‌ఆర్‌ పాలసీ తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పాక్షికంగానే విధులు..

సమ్మె ప్రభావంపై అధికారులు, సంఘాల నేతల నుంచి భిన్నమైన గణాంకాలు అందుతున్నాయి. జిల్లాలో 966 మంది వీఓఏలకు గాను 500 మంది వరకు సమ్మె నోటీసు ఇచ్చి ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం రూరల్‌, గోళ్లపాడు, తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల్లో సమ్మె తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయా లాగిన్‌ ఐడీలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అయితే మధిర, కారేపల్లి వంటి మండలాల్లో కొందరు వీఓఏలు యథావిధిగా విధులకు హాజరవుతున్నట్లు తెలిసింది. అయినా సంఘాల నిర్వహణ దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.

వచ్చేనెల 2 వరకు గడువు

ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై వచ్చేనెల 2వ తేదీ లోగా సానుకూల స్పందన రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వీఓఏల ప్రతినిధులు హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే గ్రామ దీపికలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. మధిర, కారేపల్లి మండలాల్లో వీఓఏలు సమ్మెకు దూరంగా ఉండగా.. కొన్ని మండలాల్లో పూర్తిగా సమ్మెలోకి వెళ్లడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement