నేడు మంత్రి తుమ్మల పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి తుమ్మల పర్యటన

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో టన్నెల్‌తో పాటు ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ కాలువ పనులను మంత్రి పరిశీలిస్తారు. ప్రాజెక్టు, కాల్వల నిర్మాణ పురోగతిపై అక్కడే అధికారులతో సమీక్షించనున్నారు.

పీఈ సెట్‌ పరిశీలకులుగా వెంకన్న

ఖమ్మం స్పోర్ట్స్‌: తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పీఈ సెట్‌) పరిశీలకులుగా ఖమ్మంకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.వెంకన్న నియమితులయ్యారు. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనను పరిశీలకుడిగా నియమిస్తూ పీఈ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31నుంచి జూన్‌ 3వ తేదీ వరకు శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యాన జరిగే పీఈ సెట్‌ నిర్వహణలో ఆయన పాలుపంచుకోనున్నారు.

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తులు

ఖమ్మం మామిళ్లగూడెం: గిరిజన బాలురు, బాలికలకు 3నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పథకం కింద ఇంగ్లిష్‌ మీడియం ప్రైవేట్‌ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎన్‌.విజయలక్ష్మి తెలిపారు. గత ఐదేళ్లుగా 7, 10వ తరగతి పరీక్షల్లో 90 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత, కనీసం 50 శాతం మొదటి తరగతి ఫలితాలు నమోదై, తరగతి గదులు, హాస్టళ్లు, క్రీడా సదుపాయాలు, ప్రయోగశాలలు, లైబ్రరీ, ఫర్నిచర్‌ కలిగిన స్కూళ్ల బాధ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈమేరకు ఆసక్తి, అర్హత కలిగిన పాఠశాలల యజమాన్యాలు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు. ఆపై దరఖాస్తుల పరిశీలన, అర్హత కలిగిన పాఠశాలలను ఎంపిక చేయనుండగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిర్ణీత మొత్తంలో నిధులు విడుదలవుతాయని తెలిపారు.

టీజీవోస్‌

రాష్ట్ర అధ్యక్షుడితో భేటీ

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం(టీజీవోస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్ల అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గ బాధ్యులు ఆదివారం కలిశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్‌, బాలకృష్ణ ఆధ్వర్యాన ఆయనను కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. అనంతరం అసోసియేషన్‌ను టీజీవోస్‌కు అనుబంధంగా చేర్చడంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రాంబాబు, శ్రీనివాస్‌, సుబ్బారావు, శ్రవణ్‌కుమార్‌, రమేష్‌, రత్న మనోహర్‌, సాయి, రాధాకృష్ణ, అనిత, స్రవంతి, నవ్యకాంత్‌, అవినాష్‌, అర్జున్‌, గౌతమ్‌ పాల్గొన్నారు.

నేడు హెచ్‌డీఎస్‌ సమావేశం

అభివృద్ధి పనులపై సమీక్ష, తీర్మానాలు

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్‌) సమావేశం సోమవారం జరగనుంది. కలెక్టర్‌ దివాకర టీఎస్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆస్పత్రి అభివృద్ధిపై చర్చించి 37 తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. ప్రధానంగా జనరల్‌ ఆస్పత్రికి మంజూరైన రూ.5.96 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులతో సర్జికల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల కొనుగోలు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాక ప్రస్తుత భవనం ఆస్పత్రి అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో రూ.123 కోట్ల వ్యయంతో భవనంపైన అదనంగా రెండు ఫ్లోర్లు, పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణంపైనా హెడీఎస్‌ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాక పలు విభాగాల్లో 218 పోస్టుల భర్తీ, ప్రత్యేక సెక్యూరిటీ ఔట్‌ పోస్ట్‌ ఏర్పాటు, ఎంఆర్‌ఐ మిషన్‌, ల్యాప్రోస్కోపిక్‌ సెట్‌, స్మార్ట్‌ కిచెన్‌, టీహబ్‌లో కొత్త యంత్రాలు, సోలార్‌ ఎనర్జీ సిస్టమ్‌ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement