డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
మంత్రి తుమ్మల
ఖమ్మంమయూరిసెంటర్: సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎండీ.ఖాదర్ బాబా తమ పదవుల ద్వారా ప్రజలకు మరింత మేలు చేయడమే లక్ష్యంగా పని చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఏ పదవి దక్కినా ప్రజలకు సేవ చేయడానికి పాటుపడితే గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ల అభినందన సభ ఖమ్మంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సభలో భట్టి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సమరానికి ముందే గ్రంథాలయాలు ప్రజల్లో చైతన్యం నింపాయని తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, జనగాం ప్రాంతాలు ఆ ఉద్యమాలకు కేంద్ర బిందువులుగా నిలిచాయన్నారు. అంత చరిత్ర కలిగిన గ్రంథాలయాల సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న మహమ్మద్ ఖాదర్ బాబా ప్రజలకు సేవ చేసేలా మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరిస్తారని తెలిపారు. కాగా, పదేళ్ల పాటు కష్టకాలంలో కూడా పార్టీని వీడని కార్యకర్తలను ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని డిప్యూటీ సీఎం చెప్పారు.
కష్టపడిన నేతలకు పదవులు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన నాయకులకు నేడు సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ పదవులు దక్కడం సంతోషకరమని తెలిపారు. నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తే రాష్ట్ర నాయకత్వం తప్పకుండా గుర్తింపు ఇస్తుందన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అప్పుల భారం ఉన్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం వెనుకాడడం లేదని చెప్పారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పదవులను ఆశించకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని వెల్లడించారు. సుడా చైర్మన్‌గా తనను నియమించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులకు కృతజ్ఞతలుతెలిపారు. తొలుత కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించగా, సభలో దుర్గాప్రసాద్, ఖాదర్ బాబాను డిప్యూటీ సీఎం తదితరులు ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్ట రాగమయి, రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పదవుల ద్వారా సేవ చేస్తేనే గుర్తింపు


