● రైతుల కడుపు కొడుతున్న రాష్ట్రప్రభుత్వం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలోని బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ప్రజలను వంచిస్తున్న దగా పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియాన్’ శిక్షణ తరగతులు ఆదివారం ముగియగా ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 27 మండలాలకు సంబంధించి 12ముఖ్యమైన అంశాలపై వక్తల ద్వారా శ్రేణులకు శిక్షణ ఇప్పించామని రామచంద్రరావు తెలిపారు. బీజేపీలో కీలకమైన క్రమశిక్షణను పాటిస్తూ దేశహితమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. పశ్చిమబెంగాల్‌లో బలమైన శక్తిగా ఎదిగిన తమ పార్టీ త్వరలోనే తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆ అప్పులను నేటి ప్రభుత్వం తీర్చింది..
క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగాయే తప్ప కేంద్రం పెంచలేదని, కేంద్ర ప్రభుత్వం కేవలం 3శాతం భారాన్ని మోపాల్సి వచ్చిందని రామచంద్రరావు వివరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారంటీని పూర్తిస్థాయిలో అమలు చేయకున్నా ముఖ్యమంత్రి వందసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారని అన్నారు. మక్కలు, ధాన్యం పండించిన రైతాంగం మద్దతు ధర లేక నష్టాల్లో కూరుకుపోతుంటే సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేస్తే, నేటి కాంగ్రెస్ వారిని రోడ్డున పడేసిందన్నారు. కాగా, కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న బీఆర్‌ఎస్ తేలు కుట్టే పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా పాకిస్థాన్‌తో చేతులు కలుపుతోందని విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్ డిజైన్‌ను మారుస్తూ జాప్యం చేస్తున్నారని, సమ్మక్క బారేజ్ సహా ప్రాజెక్టులన్నీ నిలిచిపోతున్నాయని ఆరోపించారు. రాబోయే ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రూ.కోట్లలో కేంద్ర నిధులు వెచ్చించి నగర రూపురేఖలు మార్చేస్తామని హామీ ఇచ్చారు.ఖీ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


