● ఉమ్మడి జిల్లాలోని రెండుచోట్ల క్యాంప్‌లు ● సృజనాత్మకత అంశాల్లో విద్యార్థినులకు శిక్షణ ● భోజనం, వసతి కల్పన, ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
సెలవుల్లో ఊర్లకు వెళ్లడం, లేదా ఇంట్లోనే గడిపేవాళ్లం. కానీ ఈసారి సమ్మర్ క్యాంప్‌నకు రావడం ఉత్సాహంగా ఉంది. ఇక్కడ కంప్యూటర్ డీకోడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్‌తో పాటు యోగా, ఇతర అంశాలు నేర్పిస్తున్నారు. మాలో భయాన్ని పోగొట్టి ఇంగ్లిష్ సులువుగా, ధైర్యంగా మాట్లాడేలా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
–పద్మ, విద్యార్థిని, జూలూరుపాడు క్యాంప్
చిన్నప్పటి నుంచి డ్రాయింగ్, కుట్లు, అల్లికలు అంటే ఇష్టం. ఈ క్యాంపులో వాటిని నేర్పిస్తున్నారు. వీటితో పాటు గణితం సులువుగా చేసేలా సూత్రాలు చెబుతున్నారు. అన్ని కేజీబీవీల విద్యార్థినులు రావడంతో కుటుంబంలా కలిసిపోయాం. ఈ శిక్షణతో చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తాననే నమ్మకం ఏర్పడింది.
–కావేరి, విద్యార్థిని, లచ్చగూడెం కేజీబీవీ క్యాంప్
కేజీబీవీ విద్యార్థినుల్లో అద్భుతమైన సృజనాత్మకత, ప్రతిభ దాగి ఉన్నాయి. వీటిని వెలికితీసి ఆల్‌రౌండర్లుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో క్యాంపులను ఏర్పాటు చేశాం. ఆటలకే పరిమితం కాకుండా లలిత కళలు, భవిష్యత్‌కు అవసరమయ్యే కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ అంశాల్లో ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం.
–అన్నామణి, జీసీడీఓ భద్రాద్రి జిల్లా
కరకగూడెం: వేసవి సెలవులు వృథా కాకుండా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని బాలికలకు సృజనాత్మక రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఏడాదంతా పుస్తకాలకే పరిమితమయ్యే వీరిలో నైపుణ్యాలను వెలికితీయడమే కాక కొత్త అంశాలు నేర్చుకునేలా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సంగీతం నుంచి కంప్యూటర్ వరకు, యోగా నుంచి చిత్రలేఖనం వరకు పలు అంశాల్లో రెసిడెన్షియల్ విధానంలో ఈ శిక్షణ కొనసాగుతోంది.
జూలూరుపాడు, లచ్చగూడెంలో శిబిరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు కేజీబీవీలో జిల్లాస్థాయి ప్రత్యేక సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని 14 కేజీబీవీల్లో 6 నుంచి 9వ తరగతి ఉత్తీర్ణులైన 120 మంది విద్యార్థినులు ఇందులో పాల్గొంటున్నారు. అలాగే, ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని లచ్చగూడెం కేజీబీవీలో 60 మంది విద్యార్థినులకు శిక్షణ కొనసాగుతోంది. రెండు శిబిరాల్లో కలిపి 16 మంది మహిళా ఇన్‌స్ట్రక్టర్లను నియమించగా, భోజనం, వసతి సౌకర్యాలను కూడా కల్పించారు. ఈ నెల 11వ తేదీన మొదలైన శిబిరాలు నేడు (సోమవారం) ముగియనున్నాయి.
ఉదయం యోగా.. సాయంత్రం ఆటలు
రోజంతా శిక్షణ ఇస్తే విద్యార్థినుల్లో ఆసక్తి తగ్గే అవకాశముందని భావించిన అధికారులు విభిన్నమైన అంశాలు నేర్చుకునేలా టైమ్ టేబుల్ రూపొందించారు. ఉదయం 6–30 నుంచి 7–30 వరకు యోగాసనాలు, ఆ తర్వాత 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యా నైపుణ్యాలు, లలిత కళల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రకరకాల క్రీడల్లో శిక్షణ కొనసాగుతోంది.
బహుముఖ నైపుణ్యాల సమాహారం
సమ్మర్ క్యాంప్ కేవలం ఆటలకే పరిమితం కాకుండా విద్యార్థినులను మేటిగా తీర్చిదిద్దేలా పలు అంశాలను ఇందులో చేర్చారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, గణిత సూత్రాలు, కంప్యూటర్ డీకోడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, కుట్లు అల్లికలు నేర్పిస్తున్నారు. దీంతో విద్యార్థినులు సైతం ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు.


