మధిర: మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన కొరివి అచ్చయ్య(90) వడదెబ్బ బారిన పడి ఆదివారం మృతి చెందాడు. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలతో అస్వస్థతకు గురైన ఆయనకు చికిత్స చేయిస్తుండగానే పరిస్థితి విషమించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
పైనంపల్లిలో ఒకరు..
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం పైనంపల్లికి చెందిన బీమాల వెంకటేశ్వర్లు (43) గ్రామాల్లో పాత ఇనుము, ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే ఆదివారం బోదులబండ – నేలకొండపల్లి మధ్య ప్లాస్టిక్, ఇనుము ముక్కలు ఏరుకునేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురైన ఆయన మార్కెట్ సమీపాన కుప్పకూలి మృతి చెందాడు.
ఖమ్మంక్రైం: ఖమ్మం పాత బస్టాండ్‌లో గురుజాల కొండలు (50) వడదెబ్బతో మృతి చెందాడు. భిక్షాటనతో జీవిస్తున్న ఆయన మృతి సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి ఫైర్‌కాలనీకి చెందిన ఎస్‌కే షాహిదా (65) తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా అస్వస్థతకు గురి కాగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఆమెకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, కుమారుడు ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.
మామిడిగుండాలలో మహిళ..
ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలం మామిడిగుండాలకు చెందిన ముక్తి పూర్ణ (35) వడదెబ్బకు గురై ఆదివారం మృతి చెందిందని ఆమె భర్త వీరస్వామి వెల్లడించారు. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతను భరించలేని ఆమె శనివారం సాయంత్రం సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కుటుంబీకులు ఇల్లెందులో చికిత్స అనంతరం ఖమ్మం తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.
బూర్గంపాడు మండలంలో ఇద్దరు..
బూర్గంపాడు: వడదెబ్బ కారణంగా బూర్గంపాడు మండలంలో ఆదివారం ఇద్దరు మృతిచెందారు. బూర్గంపాడులోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో మాస్టర్‌గా పనిచేస్తున్న కుక్కునూరు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన నోముల వంశీకృష్ణ (33) శనివారం మధ్యాహ్నం ఎండతీవ్రతతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్యం కోసం కొత్తగూడెం తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. అలాగే, సారపాక ప్రధానకూడలి సమీపాన ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పరిశీలించిన పోలీసులు మృతుడిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస ఆదివాసీ కూలీగా భావిస్తూ వడదెబ్బతోనే మృతి చెందాడనే నిర్ధారణకు వచ్చారు.
పాల్వంచ/చర్ల: ఎండదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి (50) పాల్వంచలో మృతి చెందాడు. సదరు వ్యక్తి మృతదేహాన్ని రోడ్డు పక్కన గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగితాలు ఏరుకుని జీవించే ఆయన వివరాలు తెలియరాలేదని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. అలాగే, చర్ల మండలం గోదావరి తీరం సమీపాన కోరెగడ్డ లంకల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ నర్సిరెడ్డి పరిశీలించగా, దుస్తులు లేని సదరు వ్యక్తి మృతదేహం కుళ్లిపోగా, పది రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. దీంతో సదరు వ్యక్తి మృతదేహాన్ని అక్కడే ఖననం చేశారు.
పారిశుద్ధ్య కార్మికుడు..
చుంచుపల్లి: మండలంలోని రుద్రంపూర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ఎన్.రజినీకాంత్(36) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. పనికి వెళ్లిన ఆయన ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వస్తూ తల తిప్పినట్లవుతోందని స్థానికులకు చెబుతూ లోపలికి వెళ్లాడు. భార్య, పిల్లలు ఊరికి వెళ్లడంతో ఎవరూ లేరు. కాసేపటికి ఇంటి తలుపులు తెరిచే ఉండడంతో స్థానికులు చూడగా రజినీకాంత్ అపస్మారక స్థితిలో ఉండడంతో 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పాల్వంచ మండలంలో ఇద్దరు...
పాల్వంచ/పాల్వంచరూరల్: పాల్వంచ మండలం నారాయణరావుపేట పరిధి ఎస్సీకాలనీకి చెందిన రింగు అనసూర్య (46) భద్రాచలంలో ఉన్న కుమార్తె, కుమారుడి వద్దకు శనివారం వెళ్లి ఆదివారం తిరుగు ప్రయాణమైంది. బస్సులో నాగారం స్టేజీ వద్ద దిగిన ఆమె ఆటో కోసం నిరీక్షిస్తుండగా ఎండతీవ్రతతో స్పృహ కోల్పోగా స్థానికులు గ్రామానికి తీసుకెళ్లేలోగా మృతి చెందింది. అలాగే, పాల్వంచ ఒడ్డుగూడెంకు చెందినచందన బోయిన మల్లయ్య (73) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు.
తిరుమలాయపాలెం: మండలంలోని తెట్టెలపాడు గ్రామానికి చెందిన ఐతరాజు భారతమ్మ (60) ఆదివారం మృతి చెందింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వారం రోజులుగా ఎండల తీవ్రత తాళలేక కన్నుమూసింది. ఆమెకు కుమారుడు కోటేశ్వరరావు ఉన్నారు.
భద్రాచలంలో ఇద్దరు..
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని ఒకే కాలనీకి చెందిన ఇద్దరు వడదెబ్బ తాకి మృతి చెందారు. సుభాష్‌నగర్ కాలనీకి చెందిన మాటూరి సావిత్రి (71) ఇంట్లోనే వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయింది. అదేకాలనీకి చెందిన కండె వెంకన్న (42) తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
కూసుమంచిలో..
కూసుమంచి: మండలంలోని గట్టుసింగారానికి చెందిన ఎలక్ట్రీషియన్ దుంపల సాయిచరణ్ ( 31) రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురై ఆదివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వడదెబ్బతో 16 మంది మృతి


