దహించివేస్తున్న అగ్నికీలలు | - | Sakshi
Sakshi News home page

దహించివేస్తున్న అగ్నికీలలు

May 25 2026 3:22 AM | Updated on May 25 2026 3:22 AM

చింతకాని: మండలంలోని తిమ్మినేనిపాలెం, రామకృష్ణాపురం, బస్వాపురంల్లో ఆదివారం మంటలు చెలరేగగా మామిడిచెట్లతో పాటు మొక్కజొన్న పంట దగ్ధమైంది. పంట పొలాలను శుభ్రం చేసుకునే క్రమాన రైతులు మొక్కజొన్న చెత్తకు నిప్పు పెట్టడంతో ఈదురుగాలులకు మంటలు వ్యాపించి మామిడి తోటలకు అంటుకున్నాయి. దీంతో తిమ్మినేనిపాలెంలో చెరుకూరి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, నంజాల మాధవరావుకు చెందిన 11 ఎకరాల్లోని మామిడి చెట్లు కాలిపోయాయి. అలాగే కూచిపూడి రవికుమార్‌ పొలంలో నిల్వ చేసిన 50 క్వింటాళ్ల మొక్కజొన్న రాశి దగ్ధమైంది. ఈ క్రమాన మంటలు తిమ్మినేనిపాలెం నుంచి సీతంపేట వెళ్లే రహదారి పక్కన ఉన్న చెట్లకు అంటుకోగా గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేక అగ్నిమాపక సిబ్బంది చేరుకుని అదుపు చేశారు.

కాలిన మోటార్లు, పైపులు

నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం ఆరెగూడెం గ్రామంలో ఓ రైతు ఆదివారం మొక్కజొన్న తోటలో వ్యర్థాలకు నిప్పు పెట్టాడు. వడగాలులతో ఆ మంటలు ఎగిసిపడి సమీపంలోని రైతులు దొడ్డారపు ఉపేందర్‌, చింతమళ్ల ఆనంద్‌, చింతమళ్ల రమేశ్‌, వడ్లమూడి ప్రమోద్‌, వడ్లమూడి గాంధీ, రేవతి, దొడ్డారపు వెంకటేశ్వర్లుకు చెందిన పొలాల్లో మోటార్లు, పైపులైన్లకు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో తాము భారీగా నష్టపోయా మని వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సుబాబుల్‌ తోటలు

బోనకల్‌/ఏన్కూరు: బోనకల్‌ మండలంలోని మోటమర్రిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 40 ఎకరాల్లో సుబాబుల్‌ తోట కాలిపోయింది. కొందరు రైతులు చెత్తకు నిప్పంటించి వెళ్లిపోవడంతో సుబాబుల్‌ తోటకు మంటలు వ్యాపించాయి. దీంతో గ్రామ రైతులు కంచేటి ప్రసాద్‌, బత్తినేని తిరుపతిస్వామి, బత్తినేని నీరజ, మేడ రామారావు, మేడ అప్పారావు, పారా గంగాధర్‌కు చెందిన తోటలు దగ్ధమయ్యాయి. అలాగే, ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో ఆదివారం 11 ఎకరాల సుబాబుల్‌ తోట దగ్ధమైంది. గ్రామవాసి సిరిపురపు సుదర్శన్‌రావుకు చెందిన తోట సమీపాన వరికొయ్యలకు పెట్టిన మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది.

షార్ట్‌ సర్క్యూట్‌తో..

ఎర్రుపాలెం: మండలంలోని వెంకటాపురంలో ఆదివారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వేముల వెంకటేశ్వరరావు, కూడెల్లి నాగేశ్వరరావు, చాపా వెంకటేశ్వరరావు, నున్నా సురేశ్‌ తదితర రైతులకు చెందిన జామాయిల్‌ తోటలు దగ్ధమయ్యాయి. దాదాపు ముప్పై ఎకరాల్లోని చెట్లు కాలిపోయి రూ.40 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అలాగే, రామాపురంలో నలుగురు రైతులకు చెందిన ఆరు ఎకరాల్లోని సుబాబుల్‌ తోటలు షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిపోవడంతో రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు.

12 ఎకరాల్లో మామిడితోట

పెనుబల్లి: పెనుబల్లి మండలం గంగదేవిపాడు శివారులో అజ్మీరా రాములు, బానోతు జగన్‌, మాలోతు హతీరామ్‌కు చెందిన 12ఎకరాల మామిడితోటకు నిప్పంటుకుని చెట్లు పూర్తిగా కాలిపోయాయి. అలా గే, కంటే రామచందర్‌రావుకు చెందిన ఇంజన్‌, ట్రిప్‌ పైప్స్‌, మోటార్‌ ఇంజన్‌ కూడా దగ్ధమయ్యా యి. మామిడితోటలు కాలిపోవడంతో రైతులకు సుమారు రూ.7 లక్షల నష్టం జరిగిందని తెలిపారు.

పలు ప్రాంతాల్లో మామిడి,

సుబాబుల్‌ తోటలు, పంటలు దగ్ధం

Advertisement
 
Advertisement
Advertisement