తల్లాడ: అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తల్లాడ మండలం నారయ్య బంజర సమీపాన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జయంతి వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా రామారావు కల్లూరు మండలం చండ్రపట్ల నుంచి 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మినీ వ్యాన్‌లో లోడ్ చేసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమాన నారయ్య బంజరు వద్ద తనిఖీల్లో గుర్తించి బియ్యంతో పాటు కలకొడిమకు చెందిన డ్రైవర్ తాళ్లూరి సునీల్, డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐఎన్ వెంకటకృష్ణ తెలిపారు.
బావిలో పడి రైతు గల్లంతు
వైరారూరల్: మండలంలోని తాటిపూడిలో ప్రమాదవశాత్తు బావిలో పడిన రైతు గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన రైతు నన్నెబోయిన వెంకటేశ్వర్లు (45) ఆదివారం తన గేదెలను మేత కోసం పొలాలకు తీసుకెళ్లాడు. అక్కడ గేదెలు నీరు తాగేందుకు బావిలో దిగి కొట్టుకుంటున్నాయి. ఈ క్రమాన వెంకటేశ్వర్లు వాటిని అదిలించేందుకు కర్ర విసరగా గేదెలు ఒడ్డుకి ఎక్కాయి. ఆపై బావిలో కర్రను తీసుకునేందుకు రాళ్లు విసిరిన ఆయన దగ్గరకు రాగానే కిందకు వంగగా అదుపుతప్పి బావిలో పడ్డాడు. ఆయనకు ఈత రాకపోవడంతో కేకలు వేస్తుండగా సమీపంలో ఉన్న ఓ మహిళ వచ్చి తన చీర వేసి వెంకటేశ్వర్లును కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కక నీట మునిగిపోయాడు. ఆయన కోసం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


