ఖమ్మంక్రైం: వేసవిలో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తున్న హైదరాబాద్ యువకుడు ఖమ్మంలో రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని గోషామహల్ ప్రాంతానికి చెందిన పలువురు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల బయలుదేరారు. రైలు ఖమ్మం చేరాక సంజయ్‌కుమావత్ (21), వినాయక్ నీటి కోసం కిందకు దిగారు. ఎక్కడా నీరు లేకపోవడం.. వీరు ప్లాట్‌ఫాంపై చూస్తుండగా రైలు కదిలింది. వీరి బోగి దాటడంతో వినాయక్ ఆగిపోగా, తలుపులు వేసి ఉన్న ఏసీ బోగి ఎక్కేందుకు సంజయ్ ప్రయత్నం చేశాడు. రాడ్ పట్టుకుని ఎంత పిలిచినా పలకకపోవటంతో ప్లాట్‌ఫాం దాటి 100 మీటర్లు వెళ్లాక అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో రైలులోని స్నేహితులు సంజయ్‌కు ఫోన్ చేస్తే వేరే వ్యక్తులు ఎత్తి ఆయనకు తీవ్రగాయాలయ్యాయని చెప్పగా చైన్‌లాగి వారు దిగొచ్చారు. అప్పటికే సంజయ్ రెండు కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావమై మృతి చెందగా ఆయన తండ్రి చాట్రారామ్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు కలిసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
రైలు నుంచి జారిపడి
హైదరాబాద్ యువకుడు మృతి


