మరింత మెరుగ్గా వైద్యసేవలు
జీజీహెచ్‌కు రూ.5.96 కోట్ల నిధులు
● సత్తుపల్లి, పెనుబల్లి, మధిర హాస్పిటళ్లకు కూడా.. ● పరికరాల కొనుగోలు, ఇతర అవసరాలకు వినియోగం ● ఉన్నతాధికారుల నిర్ణయంతో మెరుగుపడనున్న సౌకర్యాలు
జిల్లా జనరల్ ఆస్పత్రి
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రుల్లో కనీస వసతుల కల్పనకు కొన్నాళ్లుగా నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నుండి నిధులు రాక కార్యాలయాల్లో తెల్లపేపర్లు కొనుగోలుకు కూడా సమస్య ఎదురవుతోంది. ఈనేపథ్యాన ఉన్నతాధికారులు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాగా, వీటిని పరికరాలు, చికిత్స, శస్త్రచికిత్సలకు అవసరమైన సామగ్రి, ఆక్సిజన్‌తో పాటు అత్యవసర పెండింగ్ బిల్లుల చెల్లింపునకే వినియోగించాలని నిర్ణయించారు. ఈ విషయమై వైద్య, ఆరోగ్య శాఖ – కుటుంబ సంక్షేమ శాఖ ముఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఆదేశాలు జారీ చేశారు.
పెద్దాస్పత్రికి అత్యధికం..
ఆరోగ్యశ్రీ సేవల్లో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు నిలుస్తోంది. ఇక్కడికి ఉమ్మడి జిల్లా నుంచే కాక సరిహద్దుల్లోని సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా చికిత్స కోసం వస్తుంటారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, కంటి, గైనిక్, చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుతోంది. అయితే, ఆరోగ్యశ్రీ బిల్లులు గత నెల వరకు రూ.12 కోట్ల మేర పెండింగ్ ఉండగా, గత నెలలో రూ.5,96,37,578 విడుదలయ్యాయి. ఈ నిధులు విడుదల సందర్భంగా ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌కు సూచిస్తూ ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ అకౌంట్‌లో జమ చేశారు. అంతేకాక ఏయే పరికరాలు కొనుగోలు చేయాలో కూడా నివేదిక పంపించారు. వివిధ విభాగాల్లో సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.1,61,25,000 వెచ్చించాల్సి ఉండగా, వినికిడి లోపంతో బాధపడే వారికి అమర్చే ఎలక్ట్రానిక్ పరికరాలు, మూత్రపిండాలు, రక్తనాళాల చికిత్సకు అవసరమయ్యే పరికరాలకు రూ.3,06,03,500, ఇంకొన్ని విభాగాల్లో పరికరాల కొనుగోలుకు రూ.82లక్షలు, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రూ.47,09,078 కేటాయించాలని సూచించారు.
అత్యాధునిక పరికరాలు
పెనుబల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సత్తుపల్లి, మధిర ఏరియా ఆస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ నిధులు విడుదలయ్యాయి. ఆయా నిధులను ఆస్పత్రిలో పరికరాల కొనుగోలు, అభివృద్ధికే వెచ్చించాలని ఆదేశాలు అందాయి. పెనుబల్లి సీహెచ్‌సీకి రూ.20,95,738 విడుదల కాగా, ఆల్ట్రాసౌండ్, ఈసీజీ యంత్రాలు, ఆపరేషన్ టేబుల్ – హైడ్రాలిక్ మెజర్, శాడోలెస్ ల్యాంప్ సీలింగ్ టైప్ సింగిల్ – డోమ్ తదితర పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి మంజూరైన రూ.43,81,737 నిధులతో ఐసీయూ వెంటిలేటర్, అనస్తీషియా వర్క్ స్టేషన్, ఆల్ట్రా సౌండ్ మిషన్, ఈసీజీ మిషన్, ఆపరేషన్ టేబుల్ – హైడ్రాలిక్ మెజర్ తదితర పరికరాలు కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. అంతేకాక మధిర ఆస్పత్రికి రూ.18,06,737 ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాగా ఈసీజీ మిషన్, అనస్తీషియా వర్క్ స్టేషన్, ఆపరేషన్ టేబుల్ హైడ్రాలిక్ మెజర్, సక్షన్ అపార్టస్ – ఎలక్ట్రికల్, డెఫిబ్రిలేటర్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.
ఆరోగ్యశ్రీ నిధులతో పెద్దాస్పత్రిలో వైద్య సేవలు మరింత మెరుగు పడనున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రికి కావా ల్సిన పరికరాలు త్వరలో కొనుగోలు చేస్తాము. ఈనెల 25న కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి అజెండా ఆమోదించే అవకాశం ఉంది. తద్వారా ఏమేం పరికరాలు కొనుగోలు చేయాలో స్పష్టత వస్తుంది.
– నరేందర్, మెడికల్ సూపరింటెండెంట్,
జిల్లా జనరల్ ఆస్పత్రి


