నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన

May 24 2026 12:45 AM | Updated on May 24 2026 12:45 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఖమ్మంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. ఆతర్వాత 11–30 గంటలకు సుడా చైర్మన్‌ దుర్గాప్రసాద్‌ అభినందన సభలో పాల్గొంటారు. సాయంత్రం చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపన చేస్తారు.

సీఎంఆర్‌ఎఫ్‌తో

పేదల ఆరోగ్యానికి భరోసా

ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి

ఖమ్మంమయూరిసెంటర్‌: కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స చేయించుకుని పేదలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ పథకాన్ని అమలుచేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన 150మందికి ఆయన సిఫారసుతో మంజూరైన రూ.44లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపిక శనివారం ఖమ్మంలో అందజేశారు. ఈ సందర్భంగా రఘురాంరెడ్డి మాట్లాడుతూ దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి చెక్కులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వంద మంది ఆటోడ్రైవర్లకు ఎంపీ ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు కొప్పుల చంద్రశేఖర్‌, ఉమ్మినేని కృష్ణ, రంజిత్‌నాయక్‌, వడ్డెబోయిన నర్సింహారావు, గోసు మధు, రాంపుడి రోశయ్య, గుమ్మా రోశయ్య, ఎస్‌డీ.గౌస్‌, ఇమ్మడి తిరుపతిరావు, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జమలాపురంలో

ప్రత్యేక పూజలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయంలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అలాగే, స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం, శ్రీవారికి పల్లకీ సేవ జరిపించారు. వేసవి సెలవులు కావడంతో రెండు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌తో పాటు అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

రామయ్యకు

సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికై బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అలాగే, స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement