● రెడ్‌జోన్‌లోనే జిల్లాలో 24 ప్రాంతాలు ● వైరా, పల్లెగూడంలో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత
ఖమ్మంవ్యవసాయం: జిల్లాపై భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శనివారం 24 ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా వైరా ఏఆర్‌ఎస్, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లాలోని 42 వెదర్ స్టేషన్లలో 44నుంచి 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు కావడం గమనార్హం. ఎండ వేడికి తోడు వడగాలులతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పగటి వేళ ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఇక రాత్రి కూడా వేడి ప్రభావం కొనసాగుతుండడంతో ఇళ్లలో ఉండేందుకు సైతం అవస్థ ఎదురవుతోంది. వడగాలులు వీస్తున్న నేపథ్యాన మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాహంగా లేకపోయినా తరచూ నీరు, ఓఆర్‌ఎస్, మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఒక ప్రకటనలో సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ చిన్నారులు, వయోవృద్ధులు, గర్భిణులు బయటికి రావొద్దని తెలిపారు. ఒకవేళ వచ్చినా గొడుగు లేదా టోపీతో పాటు , సన్నని లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించాలని పేర్కొన్నారు. అందరూ సరిపడా తాగునీరు తీసుకోవాలని, ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అధిక చమట, దాహం, బలహీనత, తల తిప్పడం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బగా భావించి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.


