● మినీ ఊటీని తలపించేలా ప్రకృతి అందాలు ● పర్యాటక కేంద్రం, జలాశయంలో బోటుషికారు
పాల్వంచరూరల్: వేసవి సెలవులు ముగింపు దశకు చేరుతున్నాయి. కానీ పిల్లలు, పెద్దలు సరదాగా విహార యాత్రలకు వెళ్దామంటే మండుతున్న ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యాన ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు ఒక రోజు కేటాయిస్తే మినీ ఊటీని తలపించే పాల్వంచ మండలం కిన్నెరసానిలో ఆటపాటలతో ఆనందంగా గడిపే అవకాశముంది. అంతేకాక పర్యావరణ విజ్ఞానం కూడా పెరుగుతుంది. కిన్నెరసానిలోని ప్రత్యేకతల వివరాలతో కథనం..
ఆహ్లాదం.. జీవవైవిధ్యం
అడుగడుగునా ఆహ్లాదాన్ని పంచే అటవీ అందాలతోపాటు జీవవైవిధ్యం కిన్నెరసాని సొంతం. కొండకోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులతో చూడచక్కని ప్రకృతి అందాలకు నిలయంగా నిలుస్తోంది. ఎత్తయిన కొండలు, గుట్టలు, కిన్నెరసాని జలాశయం మధ్య చూడచక్కని ద్వీపాలే కాక వన్య ప్రాణులను కనులారా చూడొచ్చు. ఇక్కడ పర్యాటకుల కోసం తొమ్మిది కాటేజీలు, అద్దాలమేడ ఉన్నాయి.
ఇలా చేరుకోవాలి..
ఖమ్మం నుంచి పాల్వంచ 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాల్వంచకు వచ్చాక అంబేడ్కర్ సెంటర్ నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్తే కిన్నెరసాని ప్రాజెక్టు వస్తుంది. అక్కడ ప్రకృతి అందాలతో నిండిన జలాశయం, జింకల పార్కు ఉంది. అంతేకాక కిన్నెరసానికి సమీపాన మందెరకలపాడు అటవీ ప్రాంతంలో జలపాతం ఉంది. ఇక్కడ నుంచి తిరిగి భద్రాచలం వెళ్లే మార్గంలో పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అయితే, ములుగు లక్నవరంలో మాదిరి కిన్నెరసానిలో కూడా నీళ్ల మధ్య వంతెన నిర్మాణం చేపట్టంతో పాటు హోటళ్లు, వసతి గృహాలను నిర్మిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అంతేకాక కిన్నెరసాని వెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పించేలా అధికారులు దృష్టి సారించాలి.
కిన్నెరసాని రిజర్వాయర్‌లో పర్యాటకుల సౌకర్యార్థం బోటు షికారు అందుబాటులో ఉంది. అంతేకాక డీర్‌పార్క్‌లోని జింకలు, జలాశయం అందాలను చూస్తూ మైమరిచిపోవచ్చు. అలాగే, ప్రాజెక్టు కింది భాగంలో డీర్‌పార్కు ఎదుట చిల్డ్రన్ పార్కులో పిల్లలు ఆడుకునేందుకు అనేక ఆట వస్తువులు ఉంటాయి. ఇవేకాక పర్యాటక కేంద్రంలో పలు రకాల జంతువుల బొమ్మలను ఏర్పాటు చేశారు.


