మధిర: అభివృద్ధి పనుల విషయమై పంచాయతీరాజ్ ఏఈతో మహిళా సర్పంచ్ మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వీరంగం సృష్టించిన ఘటన శనివారం మండలంలోని మల్లవరంలో చోటుచేసుకుంది. మల్లవరంలోని ఎస్టీకాలనీలో అభివృద్ధి పనులకు ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. అయితే, కనీస సమాచారం లేకుండా పంచాయతీరాజ్ ఏఈ యశ్వంత్ కొలతలు వేస్తుండగా సర్పంచ్, సీపీఎం పార్టీకి చెందిన మందడపు లక్ష్మి ప్రశ్నించారు. దీంతో ఆయన పొరపాటు జరిగిందని, మరోసారి వస్తాయని వెళ్లిపోతుండగా కాంగ్రెస్ నాయకుడు కరివేద రాంబాబు ‘మీకు చెప్పేది ఏమిటి, మా ఇష్టం’అంటూ సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగాడు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏ గ్రామానికి వెళ్లినా పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులను గౌరవిస్తారని, కానీ ఇక్కడ రాంబాబు తీరు అందుకు విరుద్ధంగా ఉండడాన్ని పలువురు తప్పుపట్టారు. చివరకు ఏఈ రోడ్డు కొలతలు తీసుకోకుండానే వెనుదిరిగాడు.
సోదరుల ఇళ్లలో
10తులాల బంగారం చోరీ
రఘునాథపాలెం: మండలంలోని కోయచలక గ్రామానికి చెందిన అన్నాదమ్ముళ్లు పెరుమాళ్లపల్లి విజయ్, శేఖర్ ఇళ్లలో చోరీ జరిగింది. ఈ నెల 19వ తేదీన కుటుంబ సభ్యులంతా ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. శనివారం వచ్చేసరికి ఇంటి తలుపులు, బీరువాల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఈ మేరకు విజయ్ ఇంట్లోని బీరువాలో 8.50 తులాలు, ఆయన సోదరుడి ఇంట్లో తులంన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్, ఎస్‌ఐ నరేశ్‌తో క్లూస్‌టీం బృందం పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
నాగులవంచలో..
చింతకాని: మండలంలోని నాగులవంచలో ఇటీవల జరిగిన చోరీపై శనివారం కేసు నమోదైంది. గ్రామానికి చెందిన మందా వెంకటమ్మ తన బంగారు పుస్తెలతాడును ఈ నెల 18న రాత్రి బీరువాలో భద్రపరిచి ఆరుబయట పడుకుంది. తెల్లవారేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండగా, బీరువాలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడు కనిపించలేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరేందర్ తెలిపారు.
చెత్త సేకరణలో మార్పు రావాలి
● కంపోస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హేమలత
ఖమ్మంమయూరిసెంటర్: నగరాలు, పట్టణాల్లో చెత్త నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగేలా ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలని సీడీఎంఏ కంపోస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎ.హేమలత సూచించారు. ఖమ్మం డంపింగ్ యార్డ్‌లో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులు, సిబ్బందికి తడి – పొడి చెత్త వేరు చేయడం, తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. ఇంటిస్థాయి నుంచే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తే శాశ్వత వ్యర్థాల నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపారు. తడి చెత్తను ఎరువుగా మార్చడం వల్ల డంపింగ్ యార్డ్‌లపై భారం తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని చెప్పారు. అలాగే, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపించడం ద్వారా జీరో వేస్ట్ సిటీ లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చన్నారు. కేఎంసీ డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు కె.శ్రీనివాసరావు, మున్సిపాలిటీల కమిషనర్లు, ఉద్యోగులు సంపత్‌కుమార్, శ్రీకాంత్, నరసింహ, కె.సుజాత, ప్రసాద్‌రావు, రాజశేఖర్, దిలీప్‌రెడ్డి, బెల్లం రాధిక, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


