మండుతున్న ఎండలకు తోడు వడగాలులతో జనం వడదెబ్బ బారిన పడుతున్నారు. వివిధ పనులపై బయటకు వెళ్లిన వారే కాక ఇళ్లలో ఉంటున్న వృద్ధులు సైతం ఎండ తట్టుకోలేక అస్వస్థతకు గురవుతున్నారు. ఈనేపథ్యాన ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం వడదెబ్బకు ఐదుగురు మృతి చెందారు.
పిండిప్రోలులో వృద్ధురాలు..
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చల్లా లచ్చమ్మ(87) వడదెబ్బతో మృతి చెందింది. ఎండల తీవ్రతతో శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూసింది. లచ్చమ్మకు ఐదుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె మృతదేహం వద్ద సర్పంచ్ కామల్ల సువార్త తదితరులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.
మల్లెలమడుగులో వృద్ధురాలు..
అశ్వాపురం: అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన జెట్టి పుల్లమ్మ(68) వడదెబ్బతో శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఎండల తీవ్రతకు శుక్రవారం ఆమె అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.
భవన నిర్మాణ కార్మికుడు..
పాల్వంచ: పాల్వంచ పరిధి కరవాగు గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు పులి వెంకటేశ్వరరావు(38) శనివారం ఎండదెబ్బతో మృతి చెందాడు. వడదెబ్బ బారిన పడిన ఆయనకు వాంతులు అయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. ఆయనకు భార్య, తల్లి ఉన్నారు.
మత్స్య సహకార సంఘం సభ్యుడు..
జూలూరుపాడు: జూలూరుపాడు మండలం కరివారిగూడెంకు చెందిన ధరావత్ నరసింహారావు(45) వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. సుజాతనగర్ మండలం సింగభూపాలం చెరువు మత్స్య సహకార సంఘం సభ్యుడైన ఆయన కొద్దిరోజులుగా చేపల వేటకు వెళ్తున్నాడు. ఈనెల 20వ తేదీన చేపల వేటకు వెళ్లిన నర్సింహారావు ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయనకు భార్య చంద్రకళ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సారపాకలో ఓ వ్యక్తి..
బూర్గంపాడు: సారపాక ప్రధాన రహదారిలోని మటన్‌షాపు పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని శనివారం రాత్రి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వడదెబ్బకు గురైన రక్తపు వాంతులతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆయన వద్ద గుర్తింపు కార్డు ఆధారంగా భద్రాచలానికి చెందిన అలుగునూరి నరేష్‌గా గుర్తించినట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపారు. మృతుడు కొత్తగూడెంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆఫీస్ సబార్టినేట్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.


