మెగా హబ్
జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు
రూ.166.44 కోట్ల నిధులతో
ప్రాజెక్టుకు రూపకల్పన
కన్సల్టెంట్లతో నేడు భేటీ కానున్న కేఎంసీ కమిషనర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగర ముఖచిత్రం సమూలంగా మార్పు చెందేలా ఏఐ – ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్) ఏర్పాటుకానుంది. రాష్ట్రంలోని హైదరాబాద్ అవతలి ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలతో ఖమ్మం – వరంగల్ – కరీంనగర్ గ్రోత్ కారిడార్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుతో ఐటీ, సాంకేతిక రంగాల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తం రూ.166.44 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు హడ్కో నుంచి సూత్రప్రాయంగా ఆర్థిక ఆమోదం లభించింది. ఇప్పటికే డీపీఆర్ సైతం సిద్ధం కాగా, ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఖమ్మంలోనే ఏర్పాటు చేసేలా అడుగులు పడుతున్నాయి.
విపత్తులు ఏర్పడితే స్పందించేందుకు కొంత సమయం పడుతోంది. దీనివల్ల నష్టతీవ్రత పెరుగుతోంది. ఈనేపథ్యాన సమస్య వచ్చినప్పుడు సత్వర స్పందన, సమస్య రాకముందే గుర్తించేలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగపడనుంది. మూడు కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీలు ఖమ్మంలో ఏర్పాటయ్యే కంట్రోల్ రూమ్ పరిధిలోకి వస్తాయి. ఇక ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న 18 రకాల మున్సిపల్ విభాగాల(రెవెన్యూ, ట్రాఫిక్, డ్రెయినేజీల వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, భద్రత, పౌర సేవలు వంటివి)ను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తారు. ఈ ప్రాజెక్టుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చనుండగా 25 శాతం కేంద్రం, మిగిలిన 75 శాతం నిధులను రాష్ట్రప్రభు త్వం, హడ్కో రుణాల ద్వారా వెచ్చిస్తారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. పౌరులు చేసే ఫిర్యాదుల పరిష్కారం గతంలో కన్నా మూడు రెట్లు వేగంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాలు తలెత్తినా వాటిని 94 శాతం వేగంగా గుర్తించి సరిచేసే వీలుంటుంది. ఖమ్మం నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చడమే కాకుండా.. మున్సిపల్ సేవల్లో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడంలో ఏఐ – ఐసీసీసీ గ్రోత్ కారిడార్ మైలురాయిగా నిలుస్తుందని చెబుతున్నారు.
ఏఐ – ఐసీసీసీ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమైంది. ఖమ్మంలో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం అనుకూలమైన స్థలాన్ని త్వరలోనే గుర్తిస్తాం. ఇందుకు సంబంధించి నేడు కన్సల్టెంట్లతో భేటీ ఉంది. స్థలం ఖరారు కాగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం. ఈ కారిడార్ ఏర్పాటుతో ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం కావడమే కాక విపత్తులు, ఇతర సమస్యలను సత్వరం గుర్తించే వీలు ఏర్పడుతుంది.
– అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ
వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఇప్పటికే ఏఐ – ఐసీసీసీ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈక్రమాన ప్రస్తుత గ్రోత్ కారిడార్ ప్రాజెక్టులో ఖమ్మం ప్రధాన కేంద్రం(హబ్)గా అవతరించనుంది. ఖమ్మం నుంచి వరంగల్, కరీంనగర్ వైపు వెళ్లే రహదారులతో పాటు చుట్టుపక్కల ఉండే మూడు కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీలు, ఏడు జిల్లాలు, మూడు డెవలప్‌మెంట్ అథారిటీలను కలుపుతూ కారిడార్ ఏర్పాటుకానుండగా.. మొత్తం నెట్‌వర్క్‌ను పర్యవేక్షించే ప్రధాన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) ఇక్కడే ఏర్పాటుచేస్తారు. ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్లతో చర్చలు, కంట్రోల్‌రూమ్ స్థలఖరారుపై కన్సల్టెంట్లతో చర్చించేందుకు శనివారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య హైదరాబాద్ వెళ్తున్నారు. స్థలం ఖరారయ్యాక టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది.
‘ఖమ్మం – వరంగల్ – కరీంనగర్’ గ్రోత్ కారిడార్‌తో మహర్దశ


