అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో..
ఖమ్మం సహకారనగర్: ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ దివాకర మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభ సమయాన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, ఇందిరా మహిళాశక్తి ద్వారా రుణాలతో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో పూర్తయ్యాయని తెలిపారు. ఇటీవల ఎన్నికై న సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు ప్రజలకు మరింత చేరువై సేవలు అందించాలని సూచించారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యాన ఎక్కువ సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటుచేయించాలని తెలిపారు. అలాగే, మొక్కలు నాటడం, పారిశుద్ధ్య నిర్వహణ, వచ్చే విద్యాసంవత్సరం అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకం అమలు, దివ్యాంగులకు బ్యాటరీ ఆధారిత వాహనాల పంపిణీపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, వివిధ శాఖల అధికారులు దీక్షారైనా, శ్రీరామ్, రాంబాబు, జ్యోతి, రామారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఓటర్లుగా అర్హులైన పౌరులందరి పేర్లు జాబితాలో ఉండేలా ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్‌లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులకు చోటు కల్పించడం, అనర్హుల పేర్లు తొలగించే లక్ష్యంతో ప్రత్యేక ఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 25నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగుస్తుందని చెప్పారు. ఈమేరకు బూత్ లెవల్ అధికారులు ప్రతీ ఇంట ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడమే కాక వివరాల సేకరణ, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంలో సహకరించాలని తెలిపారు. ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్చికమని వెల్లడించిన కలెక్టర్... ఫారం నింపడంలో ఇబ్బందులు ఎదురైతే బీఎల్వోలు, పోర్టల్ సేవలను వినియోగించుకోవాలని, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న ఓటర్ల తరఫున కుటుంబీకులు ఫారాలు సమర్పించవచ్చని చెప్పారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


