ఎవరు ఆదేశిస్తే మాకేంటి ? | - | Sakshi
Sakshi News home page

ఎవరు ఆదేశిస్తే మాకేంటి ?

May 23 2026 12:22 AM | Updated on May 23 2026 12:22 AM

● మిల్లుల్లో ధాన్యం క్వింటాకు ఐదు కేజీల కోత ● ‘ఏ’గ్రేడ్‌ సైతం కామన్‌ గ్రేడ్‌గా నమోదుతో మరింత నష్టం మా ప్రమేయం లేకుండానే..

● మిల్లుల్లో ధాన్యం క్వింటాకు ఐదు కేజీల కోత ● ‘ఏ’గ్రేడ్‌ సైతం కామన్‌ గ్రేడ్‌గా నమోదుతో మరింత నష్టం

తిరుమలాయపాలెం: కాంటా పూర్తయ్యాక మిల్లులకు తరలించిన ధాన్యంలో ఎలాంటి కోత విధించొద్దని, ఎక్కడైనా తరుగు తీస్తే మిల్లులను సీజ్‌ చేస్తామన్న మంత్రులు, అధికారుల హెచ్చరికలు బేఖాతరు అవుతున్నాయి. రైతులు ధాన్యాన్ని తూర్పార పట్టి కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించినా క్వింటాకు ఐదు కిలోల తరుగు తీస్తూ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన ధాన్యాన్ని మహ్మదాపురంలోని లోకేశ్వర ఇండస్ట్రీస్‌ (రైస్‌మిల్లు)కు తరలిస్తున్నారు. అయితే, మిల్లు నిర్వాహకులు క్వింటాకు ఐదు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని అడిగితే ఇతర ప్రాంతాల్లో ఎనిమిది కిలోల తరుగు తీస్తున్నారు.. తాము ఐదు కిలోలే తీస్తున్నట్లు చెబుతున్నారని పేర్కొ న్నారు. తరుగుకు అంగీకరించకపోతే దిగుమతి చేయబోమని చెబుతున్నారని వాపోయారు.

547 కాదు 517 బస్తాలే..

కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచి దారంతో కలిపి 40.600 కేజీలకు బదులు 41.250 కేజీల కాంటా వేస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు 1.5 కేజీలు మేర నష్టపోతున్నారు. ఇక మిల్లులో ఐదు కేజీల తరుగుతో నష్టం 6.5 కేజీలకు చేరుతోంది. అంతేకాక సన్న ధాన్యానికి గ్రేడ్‌ ‘ఏ’కింద క్వింటాకు రూ.2,389 చెల్లించాల్సి ఉన్నా మిల్లర్లు కామన్‌ గ్రేడ్‌ (దొడ్డు రకం)గా నమోదు చేయడంతో రూ.2,369 మాత్రమే లభిస్తోంది. ఎదుళ్లచెరువు కేంద్రం నుంచి మిల్లుకు 547 బస్తాల ధాన్యం పంపిస్తే 517 బస్తాలుగానే రశీదు ఇచ్చారు. అంటే బస్తాకు 40 కిలోల చొప్పున 1,200 కిలోలు (12 క్వింటాళ్ల) మేర తరుగు తీసినట్లయింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోలు కేంద్రం నుంచి మహ్మదాపురంలోని మిల్లుకు ధాన్యం లారీలు పంపిస్తే మాకు,

రైతులకు సమాచారం లేకుండానే క్వింటాకు ఐదు కేజీల కోత విధించారు. అలాగే, సన్నరకం ధాన్యం పంపిస్తే కామన్‌ గ్రేడ్‌గా నమోదు చేసి బిల్లులు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల

దృష్టికి తీసుకెళ్తాం.

– పేరం సత్యనారాయణ, సీఈఓ,

తిరుమలాయపాలెం సొసైటీ

Advertisement
 
Advertisement
Advertisement