నేటి నుంచి విత్తన వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి విత్తన వారోత్సవాలు

May 23 2026 12:22 AM | Updated on May 23 2026 12:22 AM

మధిర: రైతులకు నాణ్యమైన విత్తనాలను సమకూర్చడమే లక్ష్యంగా శనివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు విత్తన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మధిర వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రుక్మిణిదేవి తెలిపారు. రానున్న వానాకాలం సీజన్‌కు అవసరమైన కంది, పెసర, మినుము తదితర పంటల విత్తనాల ను ఈ వారోత్సవాల్లో రైతులు పొందొవచ్చని వెల్లడించారు. పెసర విత్తనాలు కిలో రూ.180, మినుము విత్తనాలు రూ.180, కందుల విత్తనాలు రూ.200చొప్పున విక్రయిస్తామని తెలి పారు. అలాగే, వరి విత్తనాలు కిలో రూ.75, మొక్కజొన్న విత్తనాలు కిలో రూ.147 చొప్పు న అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తి ఉన్న వారు వివరాలకు పరిశోధన స్థానంలో సంప్రదించాలని రుక్మిణిదేవి సూచించారు.

రేపు సుడా, గ్రంథాలయ చైర్మన్ల అభినందన సభ

ఖమ్మంమయూరిసెంటర్‌: ఇటీవల సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లుగా నియమితులైన పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మహ్మద్‌ ఖాదర్‌ బాబా అభినందన సభ ఆదివారం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు సభ మొదలవుతుందని వెల్లడించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు పాల్గొనే సభకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

డీఆర్వోగా రాంమూర్తి

ఖమ్మం సహకానగర్‌: జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా సీహెచ్‌.రాంమూర్తి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి డీఎస్‌.లోకేష్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డీఆర్వోగా ఉన్న పద్మశ్రీ ఉద్యోగ విరమణ చేశారు. ఈ స్థానంలో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో డిప్యూటేషన్‌పై అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాంమూర్తిని నియమించారు. ఆయన ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

డీఎల్‌పీఓల నియామకం

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మం, కల్లూరు డివిజనల్‌ పంచాయతీ అధికారులను నియమిస్తూ అదనపు కలెక్టర్‌ పి.శ్రీజ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం డీఎల్‌పీఓగా ఉన్న రాంబాబు ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కల్లూరు డీఎల్‌పీఓ విజయలక్ష్మికి ఖమ్మం డీఎల్‌పీఓగా, వైరా ఎంపీఓ డి.రాజేశ్వరికి కల్లూరు డీఎల్‌పీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రామయ్యకు

పుష్యమి పట్టాభిషేకం

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాల అలంకరణతో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం పుష్యమి నక్షత్రం కావడంతో పట్టాభిషేకోత్సవం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement