చింతకాని: కాంటా అయిన మొక్కజొన్న బస్తాలను గోదాంలకు తరలించేందుకు లారీలు సమకూర్చడం లేదని ఆరోపిస్తూ పలువురు రైతులు శుక్రవారం చింతకాని సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. మొక్కజొన్న కాంటాలు వేసి నెల దాటినా సొసైటీ సిబ్బంది లారీలు సమకూర్చడం లేదని పేర్కొన్నారు. లారీల ఏర్పాటుకు నియమించిన ఏజెంట్లు వారికి ఇష్టం వచ్చిన రైతుల సరుకు మాత్రమే ఎగుమతి చేయిస్తున్నారని వాపోయారు. అయితే, సరిపడా లారీలను ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో తాళం తీసిన రైతులు ఆందోళన విరమించారు.


