సత్తుపల్లిటౌన్: ఇద్దరు స్నేహితులైన విద్యార్థులు. ఇందులో ఒకరు ఆవుల పోతురాజు, మరొకరు జొన్నలగడ్డ భానుప్రకాష్. వీరు ఇటీవలే సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఈ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని ఎన్‌సీహెచ్ రమాదేవి మార్గదర్శకత్వంలో తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు. గత ఏడాది ఆవుల పోతురాజు ‘నాన్నే నా హీరో’పేరిట కథలు రాయగా గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ పుస్తకంగా ప్రచురించింది. ఈ కథలన్నీ చదివిన భానుప్రకాశ్‌కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌పై ఆసక్తి ఉండడంతో ఒక కథను రెండున్నర నిమిషాల నిడివితో వీడియో రూపొందించాడు. ఇంట్లోని సెల్‌ఫోన్, తెలిసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈ వీడియో తయారుచేయగా.. ఉపాధ్యాయుని రమాదేవి ద్వారా తెలుసుకున్న గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ బాధ్యులు బి.మధుసూదన్‌రాజు, జి.రామకృష్ణ వివరాలు తెలుసుకున్నారు. చాట్ జీపీటీ ద్వారా కథను అప్‌లోడ్ చేయడం, కథకు అవసరమైన చిత్రాలు, సన్నివేశాలు ఎంపిక చేసుకోవడం, వాయిస్ ఓవర్ జతపర్చడం ఇవన్నీ చేయడానికి మూడు, నాలుగు రోజులు పట్టిందని భానుప్రకాశ్ వివరించాడు. అయితే, సొంతంగా సెల్‌ఫోన్ లేదని.. ఉంటే కనుక ఇంకా త్వరగా చేయగలనని తెలిపాడు. ప్రస్తుతం పోతురాజు రాసిన ‘నాన్నే నా హీరో’పుస్తకంలోని ఓ కథను వీడియో రూపొందించగా.. మిగతా కథలకు కూడా వీడియోలు తయారు చేయాలనుకుంటున్నట్లు భానుప్రకాష్ వెల్లడించాడు.


