వడదెబ్బతో 11మంది మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో 11మంది మృతి

May 23 2026 12:22 AM | Updated on May 23 2026 12:22 AM

ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత కారణంగా పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. ఈమేరకు వడదెబ్బకు గురైన 11మంది మృతి చెందారు.

ఖమ్మంక్రైం: ఖమ్మంలో గుర్తుతెలియని యాచకుడు (65) వడదెబ్బతో మృతి చెందాడు. జీఆర్‌ ఆయిల్స్‌ ఎదురుగా రోడ్డుపై యాచకుడు మృతి చెందినట్లు అందిన సమాచారంతో పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించి పంచనామా అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

● ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన నాగయ్య(55) కాల్వొడ్డులో పూల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆయన అస్వస్థతకు గురై మృతి చెందాడు. అలాగే, పరిగిముక్కల కాలనీకి చెందిన అచ్యుత్‌రావు(70) తీవ్ర అస్వస్థతతో కన్నుమూశాడు.

కొణిజర్ల: పనిప్రదేశంలో వడదెబ్బకు గురైన ఉపాధి కూలీ పాముల శ్రీను (53) మృతి చెందాడు. కొణిజర్లకు చెందిన శ్రీను పలువురితో కలిసి ఫీడర్‌ చానల్‌ పనులకు వెళ్లాడు. అక్కడ అస్వస్ధతకు గురవడంతో సహచరులు కొణిజర్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంపీడీఓ .ఉపేంద్రయ్య, ఏపీఓ అమ్మాజాన్‌, సర్పంచ్‌ పుష్పావతి, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌ వివరాలు ఆరా తీయగా, కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన షేక్‌ సలీం(42) వడదెబ్బతో మృతి చెందాడు. ఎలక్ట్రిక్‌ పనులు చేసే ఆయన రోజులాగే పనికి వెళ్లి అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

చింతకాని: చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన పుట్టపర్తి భద్రమ్మ(60) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందింది. చింతచిగురు అమ్మడానికి వెళ్లిన ఆమె ఎండ తీవ్రతకు వడదెబ్బ బారిన పడి కన్నుమూసిందని కుటుంబీకులు తెలిపారు.

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన యార్లగడ్డ గోవర్దన్‌రావు(70) వడదెబ్బతో మృతి చెందాడు. శానిటరీ పనులతో జీవనం సాగిస్తున్న ఆయన శుక్రవారం బయటకు వెళ్లిన సమయాన ఎండతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సీపీఐ వన్‌టౌన్‌ కార్యాలయం వద్ద రేకుల షెడ్డు కిందకు కూర్చుని అపస్మారక స్థితికి చేరాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి మృతి చెందాడు.

మధిర: మధిర మండలం ఇల్లూరుకు కోట నిరంజన్‌(60) వడదెబ్బతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నందిగామ మండలం తక్కెలపాడు, వీర్లపాడులో ఇద్దరు బంధువుల అంత్యక్రియలకు ఇటీవల నిరంజన్‌ హాజయ్యాడు. ఇంటికి వచ్చాక అస్వస్థతకు గురైన ఆయన కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, వడదెబ్బకు తోడు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల చికిత్స అనంతరం శుక్రవారం మృతి చెందాడు.

గుండాల: వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన మండలంలోని లింగగూడెంకు చెందిన జనగం రాంబాబు(43) మృతి చెందాడు. ఆయన ఖమ్మంలో ఉంటూ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. గురువారం ఆటో నడిపిన ఆయన ఇంటికి వచ్చేసరికి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించే సరికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, రాంబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఇల్లెందు: మండలంలోని ఆజాద్‌గర్‌కు చెందిన పురోహితుడు ముక్కవరపు వెంకటేశ్వర్లు (65) వడదెబ్బతో మృతి చెందారు. కొత్త లింగాలలో ఓ దశదినకర్మ కార్యక్రమం చేసిన ఆయన ఇంటికి వచ్చేసరికి అస్వస్థతకు గురవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ఎవరైనా సహాయకులను తీసుకురావాలని హాస్పిటల్‌ వర్గాలు సూచించగచినా, కుటుంబీకులు హైదరాబాద్‌లో ఉండడంతో వెంకటేశ్వర్లు సమీపంలోని హోటల్‌ వద్ద సేదతీరే ప్రయత్నం చేశాడు. ఆ సమయాన గుండెపోటు రావటంతో కుప్పకూలిపోగా ఆస్పత్రిలోకి తీసుకెళ్లి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

చర్ల: మండలంలోని దానవాయిపేటకు చెందిన దాగం సీతమ్మ(60) వడదెబ్బతో మృతి చెందింది. శుక్రవారం చర్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై కుప్పకూలింది. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూసింది.

Advertisement
 
Advertisement
Advertisement