కాంక్రీట్ ఆర్ట్, కలరింగ్ యాక్టివిటీపై పిల్లల ఆసక్తి
వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ
ఖమ్మంగాంధీచౌక్: ప్రకృతి, సృజనాత్మకతను మేళవించి అందమైన రూపాలను సృష్టించే అద్భుతమైన ప్రక్రియ రంగుల కళ. పలు విద్యాసంస్థల్లో ఈ కళపై ప్రత్యేక శిక్షణ ఇస్తుండగా పిల్లలు కూడా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. వేసవి సెలవుల్లో పలువురు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం రోటరీనగర్‌లోని కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ప్రీ స్కూల్‌లో చిన్నారులకు ఉదయం, సాయంత్రం నామమాత్రపు ఫీజుతో ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. ఇక్కడ కాంక్ట్రీట్ ఆర్ట్ మేకింగ్, కలరింగ్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు. జంతువులు, పూలు, పండ్ల బొమ్మలపై సహజత్వంతో కూడిన రంగులు వేయడం, పలు చిహ్నాలకు రంగులు దిద్దిటం వంటివి నేర్పుతున్నారు. ఈ కళ పిల్లల్లో చేతి కదలికలు, మెదడు వికాసం, చేతి, కళ్ల సమన్వయాన్ని పెంచడమే కాక ఆత్మవిశ్వాసం, స్వీయ వ్యక్తీకరణ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఈ శిక్షణతో పిల్లలు కాట్‌బోర్డు ముక్కలు, టిష్యూ పేపర్స్, కలర్ పెయింట్స్, గమ్, వాటర్, మార్కర్స్ వంటి వాటితో టెక్చర్ వంటి ఆర్ట్స్ వేస్తున్నారు.


