ఎర్రుపాలెం: మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధి రాజుపాలెం, తాటిగూడెంల్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు రైతుల జామాయిల్, మామిడి తోటలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన తల్లపురెడ్డి కోటిరెడ్డి, బసివిరెడ్డి, చిన్నసైదులు, మీరాబీ, జైనాబీ, బాజీవళీకి చెందిన 6–30 ఎకరాల్లోని జామాయిల్ తోటలు, బొగ్గుల లక్ష్మి, బూసుపల్లి శ్రీనివాసరెడ్డికి చెందిన 1.30 ఎకరాల మామిడి తోటలు కాలిపోయాయి. అయితే, అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో రూ.12 లక్షల మేర నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.
60ఎకరాల సుబాబుల్ తోట..
బోనకల్: మండలలోని మోటమర్రిలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న దంటుకు నిప్పు పెట్టారు. ఈ మంటలు వ్యాపించగా మేడ రామారావు,మేడ అప్పయ్య, బత్తినేని తిరుపతిస్వామి, పారా గంగాధర్‌రావు, కంచేటి ప్రసాద్‌కు చెందిన సుమారు 60ఎకరాల్లో సుబాబుల్ తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. గాలితీవ్రతతో మంటలు ఆర్పే పరిస్థితి లేక రెండేళ్లుంగా కష్టపడి పోయించిన తోటలు కాలిపోయి నష్టపోయామని బాధిత రైతులు వాపోయారు.
చోరీలకు పాల్పడుతున్న
నిందితుడి అరెస్ట్
ఖమ్మంఅర్బన్: ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని ఖమ్మం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారని నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం అర్బన్ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. శ్రీశ్రీ సర్కిల్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా ఏపీలోని గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకు చెందిన పట్నా ల వెంకటదుర్గ ప్రభు అలియాస్ అఖిల్‌గా తేలింది. జిమ్ ట్రైనర్‌గా పనిచేసే ఆయన రుణాల ఈఎంఐలు చెల్లించడం, విలాసవంతమైన జీవితం కోసం డబ్బు సరిపోక చోరీలను ఎంచుకున్నట్లు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాలెం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ఒంగోలు జిల్లా అద్దంకి, గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతాల్లో ఆయనపై కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల ఖమ్మం వచ్చిన అఖిల్ శ్రీరాంనగర్ రోడ్డు నంబర్–7లో ఆటో దిగి వెళ్తున్న మహిళ మెడలోనుంచి చోరీకి యత్నించాడని చెప్పారు. ఆమెను చంపేస్తానని బెదిరించి గొలుసు లాక్కుని పారిపోయే క్రమాన గొలుసు జారి కింద పడిందని తెలిపారు. ఈ కేసు విచారిస్తుండగా పట్టుబడ్డాడని ఏసీపీ వెల్లడించారు. సమావేశంలో సీఐ భానుప్రకాష్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


