ఖమ్మంరూరల్/కూసుమంచి: రాబోయే మంత్రివర్గ సమావేశంలో కొత్త ఆసరా పింఛన్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ 14వ వార్డులో రూ.4.20కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెల్దారుపల్లి ప్రాంతంలో ఇప్పటికే రూ.9కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎన్నికల హామీలన్నింటినీ ప్రభుత్వం క్రమపద్ధతిలో నెరవేరుస్తోందని చెప్పారు. అలాగే, కూసుమంచి మండలం నర్సింహులగూడెం నుంచి గోపతండా వరకు రూ.7.15 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎంపీగా ఉన్న సమయాన రహదారి సమస్యలతో ప్రజల ఇబ్బందులను చూశానని, ఇప్పుడు అవకాశం రావడంతో నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ శ్రీనివాస్, వైస్‌చైర్మన్ తమ్మినేని నవీన్, పీఆర్ ఏఈ వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


