నిరంతర శిక్షణకు దోహదం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఔత్సాహిక క్రీడాకారులు ఎక్కువగా వస్తుండడంతో స్టేడియంలో సందడి నెలకొంటోంది. వీరికి కోచ్‌లు శిక్షణ ఇస్తూనే.. సెలవులు ముగిశాక కూడా వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం పటేల్ స్టేడియంలో 14 క్రీడాంశాల్లో శిక్షణ కొనసాగుతుండగా.. ఒక్కో క్రీడాంశంలో 30 – 60 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, స్కేటింగ్, స్విమ్మింగ్, క్రికెట్, ఉషూ, బాస్కెట్‌బాల్, లాన్ టెన్నిస్, ఖో–ఖో, కబడ్డీ అంశాల్లో శిక్షణ కొనసాగుతోంది.
రెండేసి సార్లు పోటీలు
శిక్షణ ముగిసే నాటికి రెండేసి సార్లు పోటీలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఓ సారి, వేసవి క్రీడా శిబిరాల్లో భాగంగా ఇంకోసారి పోటీలు నిర్వహించనుండడంతో ఔత్సాహికులు ఆసక్తిగా హాజరవుతున్నారు. అంతేకాక విజేతలకు బహుమతులు అందించాలని స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయించింది.
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోనే కాక జిల్లా వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల శిబిరాలు సందర్శించి సాఫీగా సాగేలా సూచనలు చేశాం. జిల్లా కేంద్రంలోనే అత్యధిక క్రీడాంశాల్లో శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి. క్రీడాకారులను ఉత్సాహపరిచేలా పోటీలను కూడా నిర్వహిస్తున్నాం. తద్వారా అందులో ప్రతిభావంతులను గుర్తించి సెలవులు ముగిశాక కూడా శిక్షణకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం.
– టి.సునీల్‌రెడ్డి, డీవైఎస్‌ఓ
పటేల్ స్టేడియంలో
ముమ్మరంగా క్రీడా శిక్షణ


