ఖమ్మంమయూరిసెంటర్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడతామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు రాగా, డీసీసీ అధ్యక్షుడు వారి వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన 20 దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ కిసాన్, ఓబీసీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్‌గౌడ్, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, నాయకులు కిలారి అనిల్ కుమార్, దామా స్వరూప, ఇజ్జగాని శ్రీలత, బ్రహ్మారెడ్డి, ప్రతిభారెడ్డి, ఆరెంపుల రవి, ముక్రం అలీఖాన్, భవాని, కాపా సుధాకర్ పాల్గొన్నారు.
బైక్‌లతో స్టంట్లు చేస్తున్న ఇద్దరి అరెస్ట్
కూసుమంచి: సోషల్ మీడియాలో రీల్స్ కోసం రహదారులపై బైక్‌లతో ప్రమాదకరంగా స్టంట్లు చేసిన ఇద్దరిని ఖమ్మం టాస్క్‌ఫోర్స్, కూసుమంచి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని పెరికసింగారం గ్రామానికి చెందిన మాధవరపు శివరామకృష్ణ, కోక్యాతండాకు చెందిన బాలుడు గురువారం ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై బైక్‌లపై స్టంట్లు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించారు. ఈ అంశంపై అందిన సమాచారంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. రోడ్లపై బైక్‌లతో ప్రమాదకరంగా విన్యాసాలు చేయడం నేరమని, తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనను గమనించాలని సూచించారు.
సైబర్ మోసంపై కేసు నమోదు
చింతకాని: గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌కు పంపిన లింక్‌పై క్లిక్ చేయడంతో వ్యాపారి రూ.39,180 నగదు కోల్పోయాడు. చింతకానికి చెందిన వ్యాపారి వేముల కొండలరావు ఫోన్ పేకు ఈనెల 6వ తేదీన ఓ వ్యక్తి లింక్ పంపించాడు. అది ఓపెన్ చేయగా రెండు విడతలుగా ఖాతా నుంచి రూ.39,180 బదిలీ అయ్యాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన కొండల్‌రావు గురువారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ


