విద్యుదాఘాతంతో బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో బాలిక మృతి

May 22 2026 12:36 AM | Updated on May 22 2026 12:36 AM

తల్లాడ: కుటుంబ పెద్ద మృతి చెందడంతో బిడ్డే లోకంగా ఆమె తల్లి మరో గ్రామానికి వెళ్లి పనులతో జీవనం సాగిస్తోంది. ఇంతలోనే బిడ్డ కూడా విద్యుత్‌ షాక్‌తో కన్నుమూయడం ఆ తల్లికి విషాదాన్ని మిగిల్చింది. తల్లాడ మండలం నారాయణపురంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా.. నారాయణపురానికి ఖమ్మంపాటి కార్తీక(8) గురువారం యాదవుల బజార్‌లో నిర్మిస్తున్న భవనం వద్ద ఆడుకునేందుకు వెళ్లింది. అక్కడ కిందకు ఉన్న వైర్లను ప్రమాదవశాత్తు తాకడంతో ఆమె షాక్‌కు గురై గాయపడింది. దీంతో కార్తీకను వైరాలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. బాలిక స్వగ్రామం వైరా మండలం పుణ్యపురం కాగా, ఆమె తండ్రి ఇటీవల మృతి చెందడంతో బతుకుదెరువు కోసం తల్లి వెంకటమ్మ నారాయణపురం వచ్చి హోటల్‌లో పనిచేస్తోంది. భర్త మృతి చెందిన కొన్నాళ్లకే కుమార్తె కూడా కన్నుమూయడంతో ఆమె రోదనలు మిన్నంటాయి.

20 కేజీల గంజాయి స్వాధీనం

బస్సులో హైదరాబాద్‌ తీసుకెళ్తున్న నిందితులు

ఖమ్మంక్రైం: ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు ట్రావెల్‌ బస్‌లో తరలిస్తున్న గంజాయిని ఖమ్మం టూటౌన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. మల్కాన్‌గిరికి చెందిన రంజాన్‌కార ఇటుకల వ్యాపారం చేస్తూ హైదరాబాద్‌కు గంజాయి తరలించేవాడు. ఆయన తమ్ముడైన రాజన్‌ఖారాతో పాటు రమేష్‌ నాగులుకు డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌కు గంజాయి తరలించేలా ఒప్పించాడు. అంతేకాక మల్కన్‌గిరి నుంచి వెళ్లే బస్సు డ్రైవర్లు అరవింద్‌ గైన్‌, బిసంక మల్లిక్‌తో మాట్లాడి రెండు గంజాయి బ్యాగ్‌లను హైదరాబాద్‌ తీసుకెళ్తే రూ.10వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో గంజాయి బ్యాగ్‌లను డ్రైవర్‌ క్యాబిన్‌లో దాచి పెట్టి తీసుకెళ్తుండగా ఖమ్మం బైపాస్‌లోని ఓ కల్యాణ మండపం వద్ద బస్సు ఆగిపోయింది. ఈక్రమాన పోలీసులు తనిఖీ చేయగా రూ.10లక్షల విలువైన 20.985 కేజీల గంజాయి పట్టుబడింది. దీంతో నలుగురిని అరెస్ట్‌ చేయడమే కాక బస్సును సీజ్‌ చేసినట్లు సీఐ తెలిపారు.

3.225 కిలోలు...

ఖమ్మం కొత్త బస్టాండ్‌ వద్ద గురువారం ఎకై ్సజ్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 3.225 కిలోల గంజాయి లభించింది. గంజాయి కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఖమ్మం రూరల్‌ మండలం శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న పల్లి విక్రమ్‌గా తేలింది. ఆయన ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌ తీసుకెళ్తున్నట్లు అంగీకరించాడు. విక్రమ్‌పై గతంలోనూ రెండు కేసులు ఉన్నాయని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.కృష్ణ, ఖమ్మం–1 స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ కె.సాయిబాబాతో పాటు ఎస్సై, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement